షాడో ఎమ్మెల్యే కంచేటి సాయి అరెస్టు.. జ‌గ‌న్ సీరియ‌స్‌

గుంటూరు జిల్లాలో రాజ‌కీయాలు ఎప్పుడూ ర‌స‌వ‌త్త‌రంగానే ఉంటాయి. ఇక్క‌డ మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ మేన‌ల్లుడు అయిన కంచేటి సాయి వైసీపీ నుంచి కీల‌క నేత‌గా జిల్లాలో అంద‌రికీ ప‌రిచ‌యం. ఆయ‌న‌కు షాడో ఎమ్మెల్యే అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు ఆయ‌న అరెస్టు జిల్లాలో రాజ‌కీయ దుమారం రేపుతోంది.

కోడెల మేనల్లుడిగా పెదకూరపాడు నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగిన సాయి.. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావుకి దగ్గరయ్యారు. శంక‌రరావుకు షాడో ఎమ్మెల్యే సాయి అని పేరుంది. ఎమ్మెల్యే కూడా ఆయనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని తెలుస్తోంది.

సాయి నియోజకవర్గ పరిధిలోని ఇసుక క్వారీలపై ఆధిప‌త్యం చెలాయిస్తున్నారు. అచ్చంపేట మండలం అంబడిపూడి క్వారీని జేపీ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి కేటాయించింది వైసీపీ ప్ర‌భుత్వం. అయితే క్వారీలో పనులు చేపట్టేందుకు వచ్చిన సంస్థ ప్రతినిధులను కంచేటి సాయి అడ్డుకోవడంతో పెద్ద దుమార‌మే చెల‌రేగింది. దీంతో స‌ద‌రు సంస్థ ప్ర‌తినిధులు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో సాయిపై కేసు నమోదైంది. ఆయన్ను సత్తెనపల్లి రూరల్ పోలీసులు సాయిని అరెస్టు చేసి.. స్టేషన్‌ బెయిలిచ్చి పంపించారు. ఇక దీనిపై వైఎస్ జ‌గ‌న్ కూడా సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్‌రావును సీఎం జగన్ పిలిచి మాట్లాడే అవ‌కాశాలు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.