షర్మిల కాంగ్రెస్‌లోకి..ముహూర్తం ఫిక్స్.!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న షర్మిల..పార్టీని విలీనం చేస్తూ..ఆమె కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఇప్పటికే షర్మిల..రాహుల్ గాంధీ, సోనియాలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె కాంగ్రెస్ లోకి ఎప్పుడు వెళ్తారనేది చర్చగా మారింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 16, 17 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్‌కు వస్తున్నారు. 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది.

ఇక 17న తెలంగాణ విమోచనదినోత్సవం సందర్భంగా భారీ సభ జరగనుంది. అయితే షర్మిల 15న కాంగ్రెస్ లో చేరనున్నారని తెలిసింది. 15 సాయంత్రం సోనియా, రాహుల్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అప్పుడు షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్తారని తెలిసింది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికైతే షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయం. ఇక షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆమె స్థానం ఏంటి అనేది క్లారిటీ లేదు. పైగా ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తుందనేది క్లారిటీ లేదు.

ఇప్పటికే ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ అక్కడ తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. దీంతో సీటు ఆయనకే దక్కే ఛాన్స్ ఉంది. ఒకవేళ షర్మిల తెలంగాణ ఎన్నికల బరిలో ఉంటే..ఆంధ్రా పెత్తనం అంటూ బి‌ఆర్‌ఎస్ నాయకులు ప్రచారం చేసి..కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేయవచ్చు అనేది తెలుస్తోంది.

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ని కే‌వి‌పి రామచంద్రరావు నడిపిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్‌కు నష్టం. అందుకే ఆమెకి జాతీయ స్థాయిలో కీలక పదవి ఇస్తారని అంటున్నారు. చూడాలి మరి షర్మిల పాత్ర కాంగ్రెస్ లో ఎలా ఉంటుందో.