ఆ ‘నలుగురు’ మంత్రులు క్యాబినెట్‌లో కంటిన్యూ కావాల్సిందేనా!

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు విషయంలో ఇప్పటిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. జగన్ అధికారంలోకి రాగానే, ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని, అప్పుడు అవకాశం దక్కనివారికి మళ్ళీ రెండున్నర ఏళ్ల తర్వాత చేసే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తానని చెప్పారు. అంటే జగన్ అన్నట్లు ఈ డిసెంబర్‌కు రెండున్నర ఏళ్ళు అవుతాయి. అంటే డిసెంబర్‌లో మంత్రివర్గ విస్తరణ చేయాల్సి ఉంటుంది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు. డిసెంబర్‌లో చేస్తారా లేక ఇంకో ఆరు నెలల సమయం తీసుకుంటారనేది తెలియదు.

అలాగే ఈ సారి మంత్రివర్గం నుంచి ఎంతమందిని తప్పిస్తారనేది తెలియదు. కానీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..ఇటీవల 100 శాతం మంత్రివర్గంలో మార్పులు జరగడం ఖాయమని చెప్పేశారు. తనతో జగన్ చెప్పారని కూడా బాలినేని క్లారిటీ ఇచ్చారు. అంటే ఆ విషయం బాలినేని బహిరంగంగా చెప్పేశారు. అంటే ఇలా చెప్పడం వల్ల మంత్రులు భయంతో ఇంకా బాగా పనిచేస్తారని చెప్పారా…లేక నిజంగానే 100 శాతం మార్పులు చేస్తారా? అనేది క్లారిటీ లేదు.

కానీ కొన్ని సమీకరణాలని చూసుకుంటే…కొందరు మంత్రులని తప్పించడం వల్ల పార్టీకే నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ మంత్రులని రీప్లేస్ చేయడం చాలా కష్టం. తొందరపడి ఆ మంత్రులని కూడా పక్కనబెడితే వైసీపీకే ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఆర్ధిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సైడ్ చేయడం కష్టం…లెక్కలు, చిక్కులు లాంటివి బుగ్గనకు తెలిసినట్లుగా మరొకరికి తెలియదు. అటు అప్పులు తెచ్చే విషయంలో బుగ్గనదే కీలక పాత్ర. అలాంటప్పుడు బుగ్గనని పక్కనబెట్టలేరు.

ఇటు కొడాలి నాని లాంటి వారు పార్టీకు కీలకం. టీడీపీ చేసే విమర్శలకు కౌంటర్లు ఇవ్వాలంటే నానీనే కరెక్ట్. ఆయన మంత్రిగా ఉంటేనే ఇంకా పవర్‌ఫుల్‌గా పనిచేయగలరు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు లాంటి సీనియర్ మంత్రుల అనుభవం ఎంతో అవసరం. కాబట్టి ఈ నలుగురు మంత్రులని క్యాబినెట్ నుంచి సైడ్ చేయడం కష్టమే అని చెప్పాలి.