విశాఖ భూ కుంభకోణం..సిట్ నివేదికలో సంచలన విషయాలు

-

విశాఖ భూ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయ్. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూముల అన్యా క్రాంతంపై దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్.. కీలమైన సిఫార్సులు చేయనుంది. 22ఏ, ఎన్.వో.సీల జారీ సహా పలు అవకతవకలపై విచారించిన దర్యాప్తు బృందం వచ్చే వారం తుది నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.

విశాఖజిల్లాలో భూముల ఆక్రమణలు, రికార్డుల అవకతవకల లెక్కలు తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వం నియమించిన సిట్- 2019 తన నివేదికను సిద్ధం చేసింది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి విజయకుమార్ నేతృత్వంలోని విచారణ బృందం కీలకమైన సూచనలతో కూడిన ఫైనల్ రిపోర్ట్ ను డిశంబర్ మొదటి వారంలో ప్రభుత్వానికి సమర్పించనుంది.

ప్రభుత్వ భూముల రికార్డుల ట్యాంపరింగ్, చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఎన్.వో.సీ.లు జారీలో అధికారుల ప్రమేయాన్ని దర్యాప్తు బృందం గుర్తించింది. సుమారు నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినట్టు లెక్కతేల్చిందని సమాచారం. మొదట్లో విశాఖ రెవెన్యూ సబ్ డివిజన్ పరిధికే సిట్ పరిమితమైనప్పటికీ, ఇతర ప్రాంతాల నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిని సిట్..నాన్ సిట్ పిటీషన్లుగా విభజించి తమ పరిధిలోకి రాని కంప్లయింట్లను రెవెన్యూ యంత్రాంగంకు పంపించింది దర్యాప్తు బృందం. స్పాట్

ఈ ఏడాది జనవరిలో తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆర్కేబీచ్ రోడ్డులోని అత్యంత ఖరీదైన ఏపీఐఐసీ భూములను లు…లు..గ్రూప్ కు కేటాయింపులు వెనుక నిబంధనలు పాటించలేదని అప్పట్లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. ఇక, జిల్లాలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగింది?, దాని వెనుక ఎవరు వున్నారనే అంశాలపై దృష్టిసారించగా…సమగ్ర విచారణ తర్వాత నివేదికను పొందుపరిచింది. టీడీపీ ప్రభుత్వంలో నియమించిన సిట్ తయారు చేసిన నివేదికను ప్రస్తుత దర్యాప్తు బృందం అధ్యయనం చేసింది. వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే, మదింపు చేసి నివేదికను సిద్ధం చేసినట్టు సిట్ చీఫ్ విజయ్ కుమార్ చెప్పారు.

విశాఖజిల్లాలో భూముల లావాదేవీల్లో ఎక్కువ మంది ఇబ్బందిపడుతున్న సమస్య 22ఏకు సంబంధించింది. 22-ఏ అనేది బ్రహ్మ పదార్థంగా మారిపోయిందనే అభిప్రాయానికి సిట్ వచ్చినట్టు తెలిసింది. సుదీర్ఘ కాలం భూమి క్లాసిఫికేషన్‍ జరగకపోవడం ఓ కారణ మైతే….సమగ్రమైన రికార్డులు లేకపోవడం మరో సమస్య. ఇక, అధికారుల తీరు వల్ల ఎదురయ్యే సమస్యలతో భూములు కొనుక్కుని నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు సైతం, తర్వాత కాలంలో ఇబ్బందులు ఎదుర్కోంటున్నట్టు సిట్ గుర్తించింది.వీటికి సంబంధించి సుమారు 270 ఫిర్యాదులు రాగా, కూలంకుషంగా పరిశీలించిన తర్వాత కీలక సూచనలు చేసింది సిట్. సిట్ 2019ద్వారా విశాఖలో భూముల చుట్టూ పడుతున్న పీఠముడులు వీడిపోతాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో సిట్ రూపొందించిన నివేదిక, ఇప్పుడు సిట్ తయారు చేసిన రిపోర్ట్ ఎవరెవరి బండారాలను బయటపెట్టిందనేది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news