ఏపీ రాజకీయాల్లో పొత్తులపై రకరకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టిడిపి, జనసేన పొత్తు దిశగా వెళుతున్నాయని…అయితే కొన్ని రోజుల క్రితం పొత్తు ఉందన్నట్లు రాజకీయం చేశారు..ఇప్పుడు ఎవరికి వారు అన్నట్లు ముందుకెళుతున్నారు. కాకపోతే ఎన్నికల సమయంలో వీరి పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇదే సమయంలో ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబుని అమిత్ షా ఢిల్లీకి ఆహ్వానించారు.
అమిత్ షా, జేపి నడ్డాలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కానీ పొత్తు గురించా? లేక ఏంటి అనేది క్లారిటీ రాలేదు. ఆ తర్వాత ఏపీకి వచ్చిన అమిత్ షా..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. దీంతో బిజేపి..టిడిపితో కలుస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఎక్కడా కూడా టిడిపి నేతలు బిజేపి పొత్తు అనడం లేదు. ఇటు ఏపీ బిజేపి నేతలు సైతం..టిడిపితో పొత్తు అని మాట్లాడటం లేదు.
ఈ క్రమంలోనే ఏపీ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. టీడీపీతో బీజేపీ పొత్తుతో ముందుకు వెళుతుందని ఎవరు చెప్పారని ప్రశ్నించిన సోము… కేంద్రమంత్రి అమిత్ షాతో చంద్రబాబు కలిసినంత మాత్రాన ఎవరిష్టం వచ్చిన్నట్లు వారు ఊహించుకుంటే .. తామెలా చెబుతామని అన్నారు. అమిత్ షాతో సమావేశం అయ్యాక.. చంద్రబాబు ఎక్కడా ఆ అంశంపై మాట్లాడలేదని, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై బీజేపీ పార్టీ ముఖ్య నేతలు విమర్శలు చేశారని… ఈ పరిణామాలను ఎవరికి వారు ఎలా అయినా అన్వయించుకోవచ్చన్నారు.
ఇక పవన్ కళ్యాణ్, ముద్రగడలు ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారని… ప్రజా జీవితంలో ఉన్నారని, వారిద్దరి మధ్య వివాదం… కులపరంగా చూడకూడదని.. కేవలం రాజకీయంగా మాత్రమే చూడాలని అన్నారు. రాష్ట్రంలో గాలి మారుతుందని.. కమలం వికసిస్తుందని, కేంద్రంలో మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.