జనసేనానిలో మార్పు వ్యూహం ప్రకారం ముందడుగు

-

సమగ్ర ఏపీ నిర్మాణం కోసం పొత్తులు తప్పవ్‌…..ఇది నాలుగు నెలల క్రితం పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన మాట.అభిమానులు,కార్యకర్తలు సీఎం సీఎం అని నినదిస్తే కలలు కనండి కానీ…,వాస్తవంలో దానికి పునాదులు వేయండి అని చెప్పిన వ్యక్తి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాం అంటున్నారు.పైగా తనకు సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలని ప్రజలను అభ్యర్ధిస్తున్నారు.వారాహి యాత్ర ప్రారంభం నుంచి పవన్‌ చేస్తున్న వ్యాఖ్యలు,అనుసరిస్తున్న విధానాలు అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయ్‌.అటు రాజకీయ విశ్లేషకులు కూడా పవన్‌ వైఖరిపై ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.

పవన్‌లో ఎందుకింత మార్పు

అరాచక వైసీపీని గద్దె దింపాలంటే 2014 కాంబినేషన్‌ రిపీట్‌ కావాలని చాలా సందర్భాల్లో చెప్పారు పవన్‌ కళ్యాణ్‌. ఇందు కోసం పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసి తనకు రూట్‌ మ్యాప్‌ ఇవ్వాలని కోరారు. అయితే ఏపీలోని వైసీపీతో సత్సంబంధాలు నెరుపుతున్న బీజేపీ… రూట్‌మ్యాప్‌ విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించింది. వారాహి యాత్ర చేపట్టడానికి నెలరోజుల ముందు కూడా బీజేపీ పెద్దలను కలిశారు పవన్‌. అయినా ఎలాంటి రెస్పాన్స్‌ కనిపించలేదు. తన మాటను ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోలేదనే అనుమానం వచ్చిందో ఏమో ఇక లాభం లేదనుకుని సింగిల్‌గానే జనాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుని వారాహి యాత్ర ప్రారంభించారు. యాత్ర ప్రారంభంలో ఎన్నికలప్పుడు సింగిల్‌గా వస్తానో ఉమ్మడిగా రావాలో తేల్చుకోలేదని చెప్పారు.ఈ వ్యాఖ్యలపట్ల ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.అసలు పవన్‌ కళ్యాణ్‌ ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చారు అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. పవన్‌కి ఆ ఉద్దేశ్యం ఉంది కాబట్టే సంపూర్ణ మెజారిటీ కోసం ప్రజలను అభ్యర్ధిస్తున్నారనే చర్చలు కూడా నడుస్తున్నాయి.

పొత్తుల విషయంలో క్లారిటీ వచ్చిందా

పొత్తులు గౌరవప్రదంగా ఉండాలనేదే పవన్‌ అభిప్రాయం. గతంలో టీడీపీతో మిత్రత్వాన్ని చివరి దాకా లాక్కొచ్చింది పవన్‌ మాత్రమే. అటు బీజేపీతోనూ ఇదే విధంగా వ్యవహరించారు. అయితే ఈ సారి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొత్తులపై ఎవ్వరూ క్లారిటీ ఇవ్వట్లేదు. తీరా ఎన్నికలు సమీపించాక హడావుడి చేసి ఏదో ప్రాధాన్యం లేని సీట్లను కేటాయిస్తే అంతిమంగా నష్టపోయేది జనసేన మాత్రమే. పొత్తుల విషయంలో గతంలో చేసిన పొరపాటు మళ్ళీ రిపీట్‌ కాకూడదనుకున్న వపన్‌ ఒంటరిగానే వెళ్ళాలని ఫైనల్‌గా డిసైడైనట్లు కనిపిస్తోంది. ఎలాగైనా ఈ సారి అసెంబ్లీలో అడుగు పెడతానంటున్న పవన్‌ సొంత వ్యూహం ప్రకారమే ప్రజల్లోకి వెళుతున్నారు. పొత్తులు లేకపోయినా సింగిల్‌గానే వెళ్ళగలననే సంకేతాలిస్తున్నారు.ఇప్పటికైనా మిత్ర పక్షాలుగా చెప్పుకునే బీజేపీ,టీడీపీలు కదిలితే పర్లేదు.ఇంకా నాన్చుడు ధోరణి అవలంబిస్తే అంతిమ పోరుకి సింగిల్‌గానే సిద్ధమనే సిగ్నల్‌ ఇచ్చేశారు జనసేనాని.అవతలివారి ఎత్తులకు పైఎత్తులు వేయగలను అనేలా పవన్‌ సమర్థతను తెలియజేస్తున్నారు.

కంటెంట్‌ ఉన్నవాడికి కటౌట్‌ తో పనిలేదంటారు. తాను పవర్‌లో లేకపోయినా తన పేరులో ఉన్న పవర్‌తోనే ప్రధాన మంత్రి పక్కన కూర్చునే స్థాయికి ఎదిగారు పవన్‌ కళ్యాణ్‌.ఓడిపోయినా పర్వాలేదు కానీ ఓటు కోసం ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచను అని చెప్పిన నిఖార్సైన నేత పవన్‌. పార్టీ సిద్ధాంతాలను చూసి ఓటు వేయండి డబ్బులు తీసుకుని కాదు అని తొలి ఎన్నికల ప్రచారంలోనే తన వైఖరి తెలిపారు. తన వెనుక ఎవ్వరూ ఉండకపోయినా చిన్న వెలుగు కనిపించినా సరే పోరాటం చేస్తానంటారు పవర్‌ స్టార్‌. ప్రజాసేవ చేసేందుకు పరితపించే తత్వమే ఆయనకు అశేష అభిమాన గణాన్ని సాధించి పెట్టింది.ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే తనను పవనేశ్వరుడిగా నిలిపింది.అలాంటి నేత అధికారంలో ఉంటే ఎంతో కొ్త మేలు జరుగుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఆయనకున్న అభిమానుల్లో యువత సంఖ్యే ఎక్కువ. వారందరూ ఓటు హక్కును సంపూర్ణంగా వినియోగించుకున్నా జనసేనకు మోస్తరు సీట్లు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news