తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటుంటారు. అయితే, నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే తాము ఇంకా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేలేకపోతున్నామని ఆఫ్ ది రికార్డ్ చెప్తుంటారు. ఇక ఇటీవల టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీ దశ, దిశ మారిపోతుందని భావించారు కొందరు నేతలు. కానీ, సదరు పార్టీలో ఇంకా గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయని, అందుకే ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంద్రవెల్లి సభకు రాలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇంద్రవెల్లి ‘దళిత గిరిజన దండోరా సభ’ఎవరెవరు గైర్హాజరు అయ్యారంటే..
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకమైన తర్వాత సీనియర్లను కలుసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే వారి మద్దతు కోరుతూ పార్టీని పటిష్టం చేసేందుకు సహకరించాలని కోరారు. దాంతో కాంగ్రెస్ పార్టీని అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారనే సంకేతాలు అందాయి. అయితే, ‘దళిత గిరిజన దండోరా’ సభకు సీనియర్లు డుమ్మా కొట్టడం ద్వారా ఇంకా గ్రూపు రాజకీయాలు ఉన్నాయనే చర్చ మొదలవుతున్నది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సభకు రాకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఇంద్రవెల్లి సభకు రాకపోవడానికి గల కారణాలేంటో తెలియరాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ మొదటి స్థితికే వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి వేరే ఎవరు పోటీ అవసరం లేదని, వారిలో వారే పోటీ పడుతుంటారనే చర్చలు షురూ అయ్యాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రాజకీయ అధికారం దక్కే చాన్సెస్ తక్కువేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.