కరోనా టైంలో ఆదివాసీ ప్రజల కోసం కాలినడకన అటవీ ప్రాంతంలో, కొండల్లో నడిచి వారికి నిత్యావసర సరుకులు అందజేసిన ఎమ్మెల్యే సీతక్క గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ములుగు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, కాంగ్రెస్ పార్టీ తరఫున పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది సీతక్క. ఈ క్రమంలోనే సీతక్కలాంటి ఎమ్మెల్యే తమకు ఉంటే బాగుండని పలు నియోజకవర్గాల ప్రజలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం మనం చూడొచ్చు. తాజాగా సీతక్క వైపు ఆ నియోజకవర్గం ప్రజలు చూస్తున్నారట. ఇందుకు సంబంధించి ఆ ప్రాంత కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇతర రాజకీయ పార్టీల వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటంటే..
2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ములుగు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా దనసరి అనసూయ అలియాస్ సీతక్క గెలిచిన సంగతి అందరికీ విదితమే. పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రేగా కాంతారావు పోటీ చేసి గెలుపొందారు. కానీ, మారిన రాజకీయ పరిణామాలతో ఆయన గులాబీ గూటికి వచ్చారు. దాంతో ఆయన ప్రజలను పూర్తిగా మరిచిపోయారనే విమర్శలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట టీఆర్ఎస్‌లోకి వెళ్లిన నేతలు, శ్రేణులు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పినపాక నియోజకవర్గం నుంచి నేతలు, మేధావులు ఇప్పటికే సీతక్కను కలిసినట్లు సమాచారం. ఇక సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన పోస్టులు కూడా పెడుతున్నారు. జై సీతక్క అని కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరి కొందరు జై రేగా అని పేర్కొంటున్నారట. చూడాలి మరి.. ఈ పరిస్థితులు ఎక్కడి దాకా వెళ్తాయో..