తెలంగాణలో గత కొంతకాలం నుంచి యాక్టివ్ గా లేని బిజేపి ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చింది. అనూహ్యంగా బిజేపి డబుల్ బెడ్ రూం ఇళ్లని పరిశీలించడానికి వెళ్లింది. అసలు సడన్ గా డబుల్ బెడ్ రూం ఇళ్లపై కమలం ఎందుకు ఫోకస్ పెట్టింది? అసలు ఈ కాన్సెప్ట్ ఎవరిది? అనేది ఆసక్తికరంగా మారింది. కొత్తగా అధ్యక్షుడు అయిన కిషన్ రెడ్డి..విదేశాలకు వెళ్ళి లేటెస్ట్ గానే రాష్ట్రానికి వచ్చారు.
అయితే సడన్ గా ఈటల రాజేందర్, డికే అరుణ హౌస్ అరెస్ట్..అటు బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్లని చూడటానికి వెళ్ళిన బిజేపి నేతలని అరెస్ట్ చేశారు. దీంతో ఈటల..కేసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రతీసారి ప్రతిపక్ష నేతలని అరెస్ట్ చేయడం అధికార పార్టీకి అలవాటుగా మారిందని, ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసే హక్కు ప్రతిపక్షాలకు ఉందని తెలిపారు.
కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని… అరెస్టులు తమకేం కొత్తకాదని తెలిపారు. మీ తీరు మార్చుకోకపోతే ప్రజలే మిమ్మల్ని మార్చడం ఖాయమని, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్న కేసిఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
అయితే విదేశాల నుంచి వచ్చిన కిషన్ రెడ్డి..బాటసింగారంకు వెళ్లారు. ఇప్పుడే యుద్ధం మొదలైందని, డబుల్ బెడ్ రూం ఇళ్లని చూడటానికి వెళుతుంటే బిఆర్‌ఎస్ కు ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. అయితే ఈ కార్యక్రమానికి బిజేపి పిలుపునిచ్చిందని చెబుతున్నారు. అయితే అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారా? లేక నేతలంతా సమిష్టిగా అనుకుని పోరాటం మొదలుపెట్టారా? అనేది క్లారిటీ లేదు. కాకపోతే రేసులో వెనుకబడుతున్న నేపథ్యంలో కమలం సడన్ గా ఎంట్రీ ఇచ్చి డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి పోరాటం మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.