మారుతున్న సిక్కోలు రాజకీయం…క్యాబినెట్‌లోకి స్పీకర్?

-

ఏపీకి చివరి జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీలో ఊహించని మార్పులు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి. త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణ సమయంలో సిక్కోలు జిల్లాలో కీలక మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజులు జగన్ క్యాబినెట్‌లో ఉన్నారు. అలాగే తమినేని సీతారాం స్పీకర్‌గా ఉన్నారు.

tammineni sitaram

అయితే ఈ సారి జరిగే మంత్రివర్గ విస్తరణలో తమ్మినేని, మంత్రివర్గంలోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. స్పీకర్‌గానే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై తమ్మినేని విరుచుకుపడుతున్నారు. ఇక మంత్రిగా ఉంటే చంద్రబాబుకు చెక్ పెట్టొచ్చని చెప్పి తమ్మినేనిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి జగన్ సిద్ధమవుతున్నారని టాక్.

అంటే తమ్మినేని సీతారాంని మంత్రివర్గంలో తీసుకుంటే, ఇప్పుడున్న ఇద్దరు మంత్రుల్లో ఎవరోకరికి చెక్ పడటం ఖాయం. అంటే ఒకరి మంత్రి పదవి పోవడం గ్యారెంటీ. అదే సమయంలో స్పీకర్‌గా ఉన్న తమ్మినేని మంత్రిగా వెళితే, స్పీకర్ చైర్‌లో సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుని కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లాలో కీలక నాయకుడుగా ఉన్న ధర్మాన…నేదురుమల్లి, కోట్ల, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ క్యాబినెట్లలో పనిచేశారు. ఇక గత ఎన్నికల్లో ఈయన వైసీపీ తరుపున శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలిచారు.

మొదట్లోనే ధర్మానకు మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ తనకు మొదట నుంచి తోడుగా ఉన్న ధర్మాన సోదరుడు కృష్ణదాస్‌ని జగన్ మంత్రివర్గంలో తీసుకున్నారు. అయితే ఈ సారి జరిగే మంత్రివర్గ విస్తరణలో తమ్మినేనికి చోటు ఇస్తే ధర్మాన ప్రసాదరావుకు స్పీకర్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఒకవేళ తమ్మినేనిని స్పీకర్‌గా కంటిన్యూ చేస్తే, ధర్మాన ప్రసాదరావుని మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం. చూడాలి మరి సిక్కోలులో రాజకీయాలు ఎలా మారతాయో.

Read more RELATED
Recommended to you

Latest news