రాష్ట్రంలో ఆ రెండు పార్టీల మధ్య యుద్ధం మరింత పెరిగిపోతోంది. ఓ వైపు మహానాడు మరోవైపు బీసీ మంత్రుల బస్సు యాత్ర నేపథ్యాన ఆరోపణలూ, ప్రత్యారోపణలూ తీవ్రం అవుతున్నాయి. అందుకనో ఎందుకనో వివాదం స్థాయి నియంత్రణ రేఖ దాటి పోతోంది. ఈ నేపథ్యంలో వివాదాన్ని నియంత్రించాల్సిన ఇరు వర్గాలూ కొన్ని సార్లు హద్దులు దాటి ఆరోపణ మరియు ప్రత్యారోపణకు సిద్ధం అయి మీడియా మైకుల ఎదుట ఆవేశంతోనూ మరియు ఆగ్రహంతోనూ ఊగిపోతున్నాయి. మహానాడు కారణంగా తరలివచ్చే కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం వైసీపీ చేస్తోదన్నది టీడీపీ ఆరోపణ. ఎన్ని అడ్డంకులున్నా కూడా మహానాడుకు ముందు మినీ స్టేడియం అడిగినా అది కేటాయించకుండా తాత్సారం చేసినా కూడా తాము ఎక్కడా తగ్గబోమని ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులతో సహా ఇతర ముఖ్య నాయకులు చెబుతున్నారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే మహానాడుకు సంబంధించి ఓ వివాదం నడుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ నెల 27,28 తేదీల్లో జరగనున్న మహానాడుకు సంబంధించి ప్రభుత్వం పలు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపణలు వినవస్తున్నాయి. వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకునేందుకు అద్దె ప్రాతిపదిక ఆర్టీసీ బస్సులు కేటాయించాలని కోరినా కూడా అధికారులు ముఖం చాటేస్తున్నారన్న వాదన ఒకటి వినిపిస్తోంది.
దీంతో సంబంధిత పార్టీ నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. తమను, తమ కార్యకర్తలను మహానాడుకు హాజరుకానివ్వకుండా చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలి అని, ప్రజాస్వామ్య దేశంలో అంతా సమానమేనని, మాట్లాడే హక్కు, సభను నిర్వహించుకునే హక్కు రాజకీయ పార్టీలకే కాదు సామాన్యులకు సైతం ఉంటాయని వాటిని గౌరవించాలని కోరుతున్నారు. మీరు నియంత్రిస్తే తమ కార్యకర్తలు పిరికి వారు కాదని, ఆగిపోరని, ఉద్ధృత రూపంలో ప్రవాహ గతిలో మహానాడుకు చేరుకుని తీరడం ఖాయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు (ఆంధ్రప్రదేశ్ విభాగం) కింజరాపు అచ్చెన్నాయుడు అంటున్నారు.
మంత్రులకో రూలు మాకో రూలు
ఎందుకని.. ప్రశ్నిస్తున్న టీడీపీ
ఈ నెల 26 నుంచి సామాజిక న్యాయభేరి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ మంత్రులంతా బస్సు యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో సంబంధిత సభలకు ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ తో సహా వివిధ విద్యాసంస్థల బస్సులను వినియోగించుకుంటున్నారని, వాటికి ఫిట్నెస్ లేకపోయినా వినియోగించుకుంటున్నారని, కానీ తమకు మాత్రం అద్దె చెల్లిస్తామన్నా ఆర్టీసీ బస్సులు ఇవ్వడం లేదని, ఇదెట్ట న్యాయమని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు.