కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పట్లో లేవు.. అయితే అక్కడ రాజకీయంగా మాత్రం రగులుకుంటోంది. 2017లో నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరగ్గా టీడీపీ పాగా వేసింది. నంద్యాల ఉప ఎన్నిక ముగిసిన మూడు రోజులకే ఇక్కడ ఎన్నికలు జరగడంతో నాడు ఈ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కాకినాడలో టీడీపీ మేయర్ సుంకర పావనితో పాటు కార్పొరేటర్లు పూర్తి డమ్మీలు అయిపోయారు.
ఇప్పుడు కార్పొరేషన్లో పెత్తనం అంతా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు వైసీపీ కార్పొరేటర్లే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 50 కార్పొరేషన్ డివిజన్లు ఉండగా ఎన్నికలు జరిగిన 48 డివిజన్లలో టీడీపీ 32, వైసీపీ 10, బీజేపీ 3, ఇండిపెండెంట్లు మూడు డివిజన్లలో గెలిచారు. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో టీడీపీ కార్పొరేటర్లు పూర్తి డమ్మీలు అయిపోయారు. మరో రెండేళ్లు పాలకవర్గం గడువు ఉండడంతో వీరంతా తాము ప్రతిపక్షంలో ఉన్నా సంపాదించుకునేది ఏం లేదని.. పార్టీ మారిపోతేనే ఉపయోగం ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు.
ప్రస్తుతం కాకినాడలో జరుగుతోన్న చర్చల ప్రకారం టీడీపీకి ఉన్న 32 మంది కార్పొరేటర్లలో ఏకంగా 25 మంది వరకు వైసీపీ కండువాలు కప్పుకునేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే కాకినాడ మేయర్ పీఠాన్ని వైసీపీకే చెందిన జయరాం భార్య చంద్రకళ దీప్తికి ఇవ్వాలని అనుకున్నారు. అయితే జయరాం అనూహ్యంగా చనిపోవడంతో ఈ ప్రతిపాదన మరుగున పడింది. ఇప్పుడు ఆమెకు నామినేటెడ్ పదవి ఇచ్చి మరో వైసీపీ నేతకు మేయర్ పదవి దక్కేలా వైసీపీ పావులు కదుపుతోంది.
త్వరలోనే మేయర్ సుంకర పావనిని దింపేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే దీనిపై పావని కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కాకినాడ రాజకీయం అయితే రసవత్తరంగా మారుతోందనే చెప్పాలి.