కొండపి ఎమ్మెల్యే, మాజీ టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు బాలవీరాంజనేయ స్వామి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రపంచం లోనే అత్యంత పవిత్రమైన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్ధాన నిబందనలపై ఒక భాద్యతాయుత మంత్రి పదవిలో ఉండి కొడాలి నాని బాద్యతా రాహిత్యంగా మాట్లాడటం సిగ్గుచేటని ఆయన ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్ధానానికి వచ్చే అన్యమతస్ధులకు దేవుడిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలనే నిబందనలు ఎప్పటి నుండో ఉందని అన్నారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పుత్ర వాత్సల్యంతో సీఎం జగన్ కోసం తిరుమలలో డిక్లరేషన్ నిబందనలు అవసరం లేదు, సంతకం పెట్టాల్సిన పని లేదంటున్నారని, సీఎం జగన్ తిరుమలలో దేవుడికి మొక్కుకుని ఇడుపులపాయ వెళ్లి ప్రార్ధనలు చేస్తూ కూర్చుంటారని, వైఎస్ విజయమ్మ ఎప్పుడు చేతిలో బైబిల్ తోనే కనిపిస్తారని ఆయన అన్నారు.
మంత్రి కొడాలి నాని తిరుమలకు వెళ్లే వారికి డిక్లరేషన్‌లు అవసరమా.. ఆంజనేయ స్వామి విగ్రహానికి చెయ్యి విరిగితే నష్టమా.. కనకదుర్గమ్మ గుడిలో సింహాలు పోతే నష్టమా.. అంతర్వేదిలో రధం తగలబడితే ఏమవుతుంది.. అంటూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో తిరుమల దర్శనానికి వచ్చిన మాజీ రాష్ట్ర్రపతి అబ్దుల్ కలాం, సోనియా గాంధీసైతం డిక్లరేషన్‌పై సంతకాలు చేసిన తర్వాతే దర్శనం చేసుకున్నారని అన్నారు.