డబుల్ వర్డ్స్: టీడీపీ పోటీచేసినట్లా.. చేయనట్లా..?  

-

తాజాగా వెలువడిన ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు చూసినవారెవరికైనా… ఏపీలో ప్రతిపక్షం ఉందా అనే అనుమానం కలగక మానదు! యునానిమస్ ల సంగతి కాసేపు పక్కనపెడితే… పోటీ ఉన్న చోట కూడా మనుగడే ప్రశ్నార్థకం అవ్వడం చిన్నవిషయం కాదు. ఈ విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది.. “నవ్విపోదురుగాక నాకేటి”… అన్న చందంగా ముందుకు కదులుతుంది!

TDP Party | తెలుగుదేశం పార్టీ
TDP Party | తెలుగుదేశం పార్టీ

స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాల కోసం వైసీపీ చేయని ప్రయత్నమంటూ లేదని.. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇలాగే వ్యవహరించిందని చెప్పుకుంటూ ఆత్మవంచన చేసుకుంటున్నాయి! పోనీ అలా అని లైట్ తీసుకున్నారా అంటే… అదీ లేదు!

ఓడిన చోట మాత్రం వైసీపీ అక్రమాలకు పాల్పడింద చెప్పుకుని కంటినీరు తుడుచుకుంటున్న తమ్ముళ్లు… గెలిచిన నాలుగైదు సీట్లపై మాత్రం హడావిడి చేస్తున్నారు. వారి అనుకూల మీడియాలో … “వైసీపీ హవాలో కూడా టీడీపీ నేతలు విజయాలు సాధిస్తున్నారు.. కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది.. వైసీపీ అభ్యర్థులకు టీడీపీ అభ్యర్థులు చమటలు పట్టించారు..” వంటి శీర్షికలు పెట్టుకుంటున్నారు!

అంటే… అధికారికంగా టీడీపీ ఈ పరిషత్ ఎన్నికలలో పోటీచేసినట్లా లేక పూర్తిగా భహిష్కరించినట్లా… తమ్ముళ్లలో స్పష్టత కరువవుతుంది. ఇదేసమయంలో… కొందరు టీడీపీ నేతలు.. చంద్రబాబు మాట తోసిపుచ్చి సొంతంగా పోటీచేసుకుని గెలిచారు. అయితే ఇప్పుడు వారి విజయాన్ని తమ ఖాతాల్లో వేసుకుని మురిసిపోతున్నారు బడా నేతలు.. అనుకూల పత్రికలు! ఫలితంగా… “తమ పార్టీ పోటీచేయలేదు కాబట్టి”… అని చెప్పుకుంటున్న టీడీపీ కార్యకర్తలను… ఈ శీర్షికలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.

అక్కడ రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలిచారు.. ఇక్కడ మూడు చోట్ల టీడీపీ జెండా రెపరెపలాడింది.. పలానా చోట టీడీపీ నేతలు వైసీపీకి చమటలు పట్టించారు.. వైసీపీ హవాలో కూడా తమ్ముళ్లు విజయాలు సాధించారు.. కానీ… ఫలితాలు మాత్రం అడగకండి ప్లీజ్!

– CH Raja

Read more RELATED
Recommended to you

Latest news