2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి..ఆ తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా జగన్ దెబ్బకు నిలవకలేకపోతున్న టీడీపీ..రాజకీయంగా ఇంకా బలహీనంగా ఉందా? చంద్రబాబు జైలుకెళ్ళాక మరింత బలహీనపడిందా? పార్టీని నడిపించే సరైన నాయకుడు లేకపోవడంతో టిడిపి నేతలు సైలెంట్ అయిపోయి..వారు కూడా బలహీనంగా తయారయ్యారా? అంటే అవుననే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నారు.
ప్రత్యర్ధి పార్టీ వైసీపీ నేతలు అలా అంటే పెద్దగా విచిత్రం ఏమి ఉండదు..టిడిపి ప్రధాన ప్రత్యర్ధి కాబట్టి..ఆ పార్టీ పని అయిపోయిందని వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటారు. కానీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ ఈ కామెంట్ చేయడంతో టిడిపి శ్రేణులు, నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 40 ఏళ్ళు పైనే రాజకీయ చరిత్ర కలిగి..క్షేత్ర స్థాయిలో బలమైన పునాదులు, క్యాడర్ కలిగిన పార్టీ..బలహీనంగా ఉందని పవన్ కామెంట్ చేయడం సరికాదని అంటున్నారు. తాజాగా వారాహి యాత్రలో భాగంగా పెడనలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ..టీడీపీ బలహీన పరిస్తితుల్లో ఉందని, నాయకులు బలహీనంగా ఉన్నారని కామెంట్ చేశారు.
కాకపోతే టిడిపికి అనుభవం ఉందని, ఇటు జనసేన పోరాట పటిమ కనబరుస్తుందని, టిడిపి అనుభవానికి జనసేన యువరక్తం పోరాటం తోడైతే..జగన్‌ని ఓడించవచ్చు అని చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ పరోక్షంగా టిడిపికి ఒంటరిగా..జగన్‌ని ఎదురుకునే సత్తా లేదని పవన్ చెబుతున్నారు. తాము లేకపోతే టిడిపి పోరాడలేదని పరోక్షంగా మాట్లాడుతున్నారు.
అయితే తమ అధినేత జైల్లో ఉన్నంత మాత్రాన టిడిపి బలం ఏమి తగ్గలేదని, ఇంకా జనంలో సానుభూతి పెరిగిందని, బాబు జైలుకెళ్లిన దగ్గర నుంచి నేతలు, కార్యకర్తలు రోడ్లు ఎక్కి పోరాడుతున్నారని, కేసులకు భయపడటం లేదని, ఒకవేళ టిడిపి బలహీనంగా ఉంటే ఎవరూ రోడ్డు ఎక్కేవారు కాదని టిడిపి శ్రేణులు అంటున్నాయి.
ఇటీవల సర్వేల్లో టిడిపి ఒంటరిగా సత్తా చాటగలదని తేలిందని, కానీ ఈ సారి ప్రయోగాలు చేసి రిస్క్ తీసుకోవడం కంటే..జనసేనని కలుపుకుని ముందుకెళితే..పక్కా ఫలితం ఉంటుందని, అందుకే పొత్తుకు సిద్ధమయ్యామని టిడిపి క్యాడర్ మాట్లాడుకుంటుంది. 40 శాతం ఓటింగ్ ఉన్న టిడిపి బలహీనంగా ఉందని..6-7 శాతం ఉన్న జనసేన చెప్పడం కరెక్ట్ కాదనే భావన టిడిపి క్యాడర్ లో కనబడుతుంది.