హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టులతో ముందుకు వెళ్తున్నాయి. గెలిచి పట్టునిలుపుకోవాలన్న వ్యూహంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఉంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది. ఇక గతంలో నోటాకంటే తక్కువ ఓట్లు సాధించిన బీజేపీ.. ఈ సారి దుమ్ముదులుపాలని చూస్తోంది. అయితే.. ఈ పార్టీలను ఒక స్వతంత్ర అభ్యర్థి మాత్రం వణికిస్తున్నారు.
కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. రోజురోజుకూ ఆ స్వతంత్ర అభ్యర్థి పట్టు పెరుగుతుండడంతో ఎవరి ఓట్లకు గండిపెడుతాడోనని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఒంటరిగా వస్తున్న ఆయన ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. ఇంతకీ ఆ స్వంత్రం అభ్యర్థ ఎవరని అనుకుంటున్నారా..? ఆయనే తీన్మార్ మల్లన్న. అసలు పేరు చింతపండు నవీన్.
వీ6 చానెల్‌లో తీర్మాన్ వార్తల ప్రోగ్రాంతో నవీన్.. ప్రజల్లో తీన్మార్ మల్లన్నగా మంచి గుర్తింపు పొందారు.
ప్రస్తుతం ఆయన ఏ మీడియాలోనూ పనిచేయడం లేదు. హుజూర్‌నగర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. రోజురోజుకూ పెరుగుతున్న మద్దతుతో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు సైదిరెడ్డి, పద్మావతిరెడ్డి గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక బరిలోకి ఆయన అనూహ్యంగా అడుగుపెట్టారు. ఇక తనదైన మాటతీరుతో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను విమర్శిస్తున్నారు. బలమైన ఆరోపణలు, విమర్శలతో హుజూర్‌నగర్ ప్రజలను ఆకట్టుకోవడంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
అయితే.. తన ప్రచారాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇక్కడ ప్రధానమైన ప్రశ్నలు ఏమిటంటే.. తీన్మార్ మల్లన్న బలమేమిటి..? ఎక్కడి నుంచి వచ్చింది? వీటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం.. అధికార టీఆర్ఎస్‌పై, ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. తీన్మార్ మల్లన్న చేస్తున్న వీడియోలకు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ.. చేస్తున్న వీడియోలకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది.
ఇలా కొంతకాలం నుంచి చేస్తున్న మల్లన్నకు సోషల్ మీడియాలో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో మల్లన్న ఇదే ప్రధాన బలంగా కనిపిస్తోంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే తనలాంటి వాళ్లు అసెంబ్లీ ఉండాలని, ప్రజలు తనను దీవించాలని మల్లన్నకోరుతున్నారు. ప్రధానంగా యూత్, ఉద్యోగవర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో గుబులు మొదలైంది.