దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నారు…? కేసీఆర్ సర్కార్ పై హైకోర్ట్ ఫైర్

తెలంగాణాలో కరోనా కేసులు భారీగా ఉన్న నేపధ్యంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపటితో రాత్రి కర్ఫ్యూ ముగియనున్నందున తర్వాత చర్యలు ఏమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. రేపు పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

నియంత్రణ చర్యలపై దాగుడు మూత లెందుకు? అంటూ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం ఒక రోజు ముందు చెబితే నష్టమేంటి?: అంటూ ప్రశ్నించింది. నియంత్రణ చర్యలపై మేం ఎలాంటి సూచనలు ఇవ్వడం లేదు అని పేర్కొంది. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకొండి అని సలహా ఇచ్చింది. ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నం లోగా చెబుతానని ఏజీ కోర్ట్ కి తెలిపారు.