- బీజేపీకీ తెలంగాణ మంత్రి కేటీఆర్ వార్నింగ్
హైదరాబాద్ : అధికార పార్టీ నేత, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై పలువురు బీజేపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనను తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ తీరుపై స్పందిస్తూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు చేసే భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ ఎస్‌కు ఉందన్నారు. తమ ఓపికను పరీక్షించవద్దనీ, టీఆర్ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే.. బీజేపీ నేతలు కనీసం బయట కూడా తిరగలేని పరిస్థితి దాపురిస్తుందంటూ తీవ్రంగా హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో భౌతికదాడులు చేయడం బీజేపీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఇలాంటి దాడులకు ఇక్కడ చోటులేదని పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో రాణించాలంటే విలువలతో కూడిన రాజకీయం చేయాలంటూ బీజేపీ నేతలకు హితవు పలికారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించిందన్నారు. తమ వాదనతో ఒప్పించడం చేతకాక, దాడులకు దిగుతున్నారని, మా సహనానికి కూడా హద్దు ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడానికి బీజేపీ యత్నిస్తోందంటూ ఆరోపించారు.
కాగా, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు ఆదివారం దాడికి తెగబడ్డాయి. ఆయన ఇంటిపై రాళ్లు, గుడ్లు రువ్వడంతో కిటికీలు, అద్దాలు, పర్నీచర్ ధ్వంసం అయింది. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పలువురు బీజేపీ నేతలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.