అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నాయి. ఇక రాష్ట్ర ఎన్నికల ఉన్నతాధికారి నిమ్మగడ్డ తీసుకుంటున్న పలు నిర్ణయాలు వైకాపా ప్రభుత్వం పుండుపై కారం చల్లినట్టుగా ఉండటంతో ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో గరంగరం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైకాపా నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, వివర్శలు గుప్పిస్తున్నారు.
రాష్ట్ర పంచాయతీ ఎన్నికలు అంటే ప్రస్తుతం నిమ్మగడ్డ వర్సెస్ వైకాపా ప్రభుత్వం అనే తీరున పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అధికారా పార్టీ నేతలు ఎస్ఈసీని టార్గెట్ చేయడం తగదని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్ల వైకాపా నేతల ప్రవర్తన తీరు దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదన్నారు. రాజాకీయ పార్టీలు ఎన్నికల పోరాటం కావాలి కానీ.. నేడు ఎస్ఈసీపై వైకాపా చేస్తున్న పోరాటంలా కనిపిస్తున్నదని తెలిపారు.