ఖేల్ ఖతం : అప్పుల్లో మెలికలు? ఏపీ బీపీ

ఆంధ్రావనికి ఇచ్చే అప్పులు, ముఖ్యంగా సర్కారు తేవాలనుకుంటున్న అప్పులు వీటన్నింటిపై కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. ముఖ్యంగా కేంద్రం నిబంధనలు అనుసారమే అప్పులు ఇస్తామని లేదా ఇప్పిస్తామని అంతేకాని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకునేదే లేదని తేల్చేస్తోంది. కానీ ఏపీ మాత్రం తన వాదనను భిన్నంగా వినిపిస్తోంది. తాజాగా గ్రామీణ రహదారులకు సంబంధించి వాటి అభివృద్ధికి నిధుల్లేక విదేశీ రుణాలకు ప్రయత్నిస్తోంది జగన్ సర్కారు. ఇందులో కూడా ఓ వివాదం రేగింది.

jagan
jagan

ఎందుకంటే విదేశీ రుణాలు పొందాలన్నా ఆ ప్రాజెక్టుకు లేదా సంబంధిత పనులకు సంబంధించి రాష్ట్రం చెల్లించాల్సిన వాటా ముందుగానే చెల్లించాలి. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడంతో పనులు ఆగిపోతున్నాయి. రుణాలు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వం తరఫున వెచ్చించాల్సిన నిధులు వెచ్చిస్తేనే, ముందుగా ఆ వాటా మొత్తాన్ని చెల్లింపు ప్రక్రియలో భాగంగా పూర్తి చేస్తేనే విదేశీ రుణం అయినా లేదా స్వదేశీరుణం అయినా మంజూరు కావడం సాధ్యం అవుతుందని కేంద్రం తేల్చి చెబుతోంది.

రాష్ట్రంలో 11 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించి గ్రామీణ రహదారుల పనులకు శ్రీకారం దిద్దాలని జగన్ భావించినా ఇప్పట్లో అవేవీ ఒడ్డెక్కేలా లేవు. ఎందుకంటే కేంద్రం తరఫున కానీ లేదా సంబంధిత విదేశీ బ్యాంకు తరఫున కానీ ఒకే వాదన వినిపిస్తుంది. ఈ దశలో తమ వాటా కింద చెల్లించాల్సిన మొత్తాలను తరువాత చెల్లిస్తామని జగన్ చెబుతుంటే అందుకు నిబంధనలు ఏవీ ఒప్పుకోవని కేంద్రం తేల్చేస్తుంది. దీంతో సంక్రాంతి తరువాత గ్రామీణ రోడ్లకు మహర్దశ అని చెప్పిన మాట మేరకు పనులు జరిగి తీరేందుకు ఆస్కారమే లేకుండా పోయింది.