గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా పలు నియమాలను చేర్చింది. రానున్న ఎన్నికల్లో ఆధునిక సాంతికే పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా ఎన్నికల అధికారులు ఉపయోగించుకోనున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ పరంగా అనేక మార్పులు వస్తున్నాయి. దీంతో ప్రజల జీవన విధానం కూడా చాలా తేలికైంది. ఒకప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి చేసే పనిని ఇప్పుడు టెక్నాలజీ వల్ల నిమిషాల వ్యవధిలోనే ఎలాంటి శ్రమ లేకుండా నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణలోనూ మన దేశంలో టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఈవీఎంలు మునుపటి కన్నా ఇప్పుడు మన పనిని తేలికచేశాయి. ఇక త్వరలోనే లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం పలు కొత్త రూల్స్‌ను అందుబాటులోకి తేవడంతోపాటు టెక్నాలజీ పరంగా మరింత అడ్వాన్స్ అయింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఆధునిక సాంతికే పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా ఎన్నికల అధికారులు ఉపయోగించుకోనున్నారు.
గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా పలు నియమాలను చేర్చింది. అవేమిటంటే…
1. ఈసారి ఈవీవెంపై పార్టీ గుర్తుతోపాటు అభ్యర్థుల ఫొటోలను కూడా ముద్రించనున్నారు.
2. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్‌లు, జీపీఎస్ సిస్టంను ఉపయోగించనున్నారు.
3. ఈ సారి ఎన్నికల్లో కొత్తగా 8.43 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
4. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గత 5 సంవత్సరాలుగా సమర్పిస్తున్న ఐటీ రిటర్నులను, పాన్ కార్డు సమాచారాన్ని అందజేయాలి. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు, తమ ఆస్తి వివరాలను తెలియజేయాలి. విదేశాల్లో ఆస్తులు ఉన్నా సరే.. వాటి వివరాలను కూడా సమర్పించాలి.
5. ఓటర్ స్లిప్పులను గుర్తింపు కార్డులుగా అనుమతించడం లేదు.
6. ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ప్రభుత్వం జారీ చేసిన సర్వీస్ ఐడీ కార్డు, ఫొటోతో ఉన్న బ్యాంకు పాస్‌బుక్, పాన్ కార్డు, రిజిస్ట్రార్ జారీ చేసిన స్మార్ట్ కార్డు, ఉపాధి హామీ లేదా జీవిత బీమా కార్డు, పెన్షన్ పత్రం, ప్రజాప్రతినిధులు ధ్రువీకరించిన గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులను ఈసారి ఎన్నికల అధికారులు ఓటింగ్‌కు గుర్తింపు కార్డులుగా అనుమతివ్వనున్నారు.
7. ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు చేసే ఖర్చును గుర్తించేందుకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నగదును భారీ ఎత్తున తరలించే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.
8. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వాడే వాహనాలు, ప్రకటనలు, ప్రచారం, యాడ్స్ తదితర వ్యయాలను అభ్యర్థుల ఖర్చులుగా భావిస్తారు.
9. అభ్యర్థులు సోషల్ మీడియా లేదా ఇంటర్నెట్‌లో ప్రచారం చేస్తే ఆ ఖర్చును కూడా ఎన్నికల ఖర్చు జాబితాలో చేర్చాలి.
10. ఎంపీ అభ్యర్థులకు రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టుకునే సౌలభ్యం కల్పించారు. అదే అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో అయితే ఈ పరిమితిని రూ.54 లక్షలుగా నిర్ణయించారు.
11. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో తమకు ఉన్న సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను ఇవ్వాలి.
12. ఆన్‌లైన్ లో కనిపించే పొలిటికల్ యాడ్స్‌ను ఇకపై కచ్చితంగా తనిఖీ చేస్తారు. ఈ క్రమంలో గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సంస్థలు ముందుగా రాజకీయ ప్రకటనను చూసి, నిబంధనలకు అనుగుణంగా యాడ్స్ ఉన్నాయని అనిపిస్తేనే వాటిని పోస్టింగ్‌కు అనుమతినివ్వాల్సి ఉంటుంది.
13. రాజకీయ ప్రకటనలకు సంబంధించి ఎవరైనా చేసే ఫిర్యాదులను స్వీకరించేందుకు ఈసీ ప్రత్యేక అధికారులను నియమించనుంది.