వైసీపీలో మూడుముక్క‌లాట‌.. ఏం జ‌రుగుతోందంటే…!

-

శ్రీకాకుళం జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట‌. ఇక్క‌డ కింజ‌రాపు కుటుంబం ఆదినుంచి పార్టీని బ‌లంగా ముందుకు తీసుకు వెళ్తోంది. అలాంటి జిల్లాలో పార్టీప‌రుగులు పెట్టించి.. టీడీపీకి చెక్ పెట్టాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ భావించారు. ఈ క్ర‌మంలోనే ఉన్న నాయ‌కుల‌కుతోడు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని కూడా పార్టీ లోకి తీసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈమెస్థానికంగా వైసీపీ నేత‌లైన పేరాడ తిల‌క్‌, దువ్వాడ శ్రీనుల మ‌ధ్య చేరి.. గ్రూపు రాజ‌కీయాలు చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పేరాడ‌, దువ్వాడ‌ల‌కు జ‌గ‌న్ టికెట్లు ఇచ్చారు. కానీ, వారిద్ద‌రూ ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. వారిని ప‌క్క‌న పెట్ట‌కుండా.. వివిధ ప‌ద‌వులు ఇచ్చారు. క‌లిసి ప‌నిచేయాల‌ని దిశానిర్దేశం చేశారు. అయినాకూడా వారిలో వారు నిత్యం ఆధిప‌త్య పోరు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నను కట్టడి చేసే ఉద్దేశంతో  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌.. టెక్కలి వైసీపీ బాధ్యతలను త‌నే స్వ‌యంగా తీసుకున్నారు. ఈ క్ర‌మంలో దువ్వాడ శ్రీనివాస్‌ను టెక్కలి వైసీపీ ఇంఛార్జ్‌గా చేశారు.

పేరాడ తిలక్‌ను కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ను చేశారు. ఇలా పదవుల పంపకం చేపట్టడంతో అంతా సర్దుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని భావించారు. కానీ..  దువ్వాడ శ్రీనివాస్‌కు చెక్‌పెట్టాల‌నే ఉద్దేశంతో కిల్లి కృపారాణి.. పేరాడ తిల‌క్‌లు ఒక్క‌టై.. ఇక్క‌డ రాజ‌కీయాలు చేస్తున్నారు.  కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేసే ఉద్దేశంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు పేరాడ. ఈ సభకు అందరినీ ఆహ్వానించారు కానీ.. దువ్వాడకు చెప్ప‌లేదు. దీంతో ఆయ‌న  నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశారు.

ఈ పంచాయితీ ఎంపీ విజయసాయిరెడ్డికి  దగ్గరకు చేరింది. అయితే, దీనిపై ధ‌ర్మాన సీరియ‌స్ అయ్యారు. నేనుండ‌గా .. నాకు చెప్ప‌కుండా సాయిరెడ్డి ఎవ‌రు అంటూ.. ఆయ‌న ఫైర‌య్యారు. ఇలా అయితే.. పార్టీని గాడిలో పెట్ట‌డం త‌న వ‌ల్ల‌కాద‌ని ఆయ‌న నిర్మొహ‌మాటంగా చెబుతున్నారు. మొత్తంగా పేరాడ‌, కిల్లి, దువ్వాడ‌ల మ‌ధ్య ఏర్ప‌డిన ఆధిపత్య పోరుతో కేడ‌ర్ నిర్వీర్య‌మ‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా.. జ‌గ‌న్ స్వ‌యంగా క‌లుగ జేసుకుని ఇక్క‌డి ప‌రిస్థితి స‌రిదిద్దాల‌ని వారు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news