హుజూరాబాద్ పోరులో ఎలాగైనా సత్తా చాటి, ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టాలని అధికార టీఆర్ఎస్(TRS) చూస్తూనే ఉంది. ఈటల టీఆర్ఎస్‌ని వీడి బీజేపీలో చేరిన దగ్గర నుంచి హుజూరాబాద్‌లో వ్యూహాత్మక్మగా అడుగులేస్తుంది. బలమైన ఈటలని ఓడించి హుజూరాబాద్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేయాలని అనుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే పదునైన వ్యూహాలతో ముందుకెళుతుంది.
మొదట నుంచి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లో మకాం వేసి అక్కడి ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఈటల వైపుకు వెళ్లకుండా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇంకా అభ్యర్ధిని ప్రకటించకపోయిన కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలని చెప్పి ఓట్లు అడుగుతున్నారు. అలాగే నియోజకవర్గంలో నిధుల వరద పారిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇన్నేళ్లు ఈటల హుజూరాబాద్‌ని అభివృద్ధి చేయలేదని విమర్శిస్తున్నారు.
ఇదే క్రమంలో నియోజకవర్గంలో ఉండే రైతులని ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ సరికొత్త వ్యూహంతో ముందుకెళుతుంది. రైతుబంధు సహ ఇతర పథకాలని రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పుడు అదే అంశాలని చెబుతూ, రైతులకు లేఖలు రాస్తున్నారు. రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యక్తిగతంగా రైతులకు లేఖలు రాస్తున్నారు.
బహిరంగ లేఖల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని చెప్పి, హుజూరాబాద్‌లో ఉన్న ఒక్కో రైతుకు పర్సనల్‌గా లేఖాస్త్రం సంధిస్తున్నారు. ఇలా వ్యక్తిగతంగా లేఖలు రాయడం వల్ల పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఈటలకు వచ్చే మద్ధతుని తగ్గించవచ్చని అనుకుంటున్నారు. మరి ఈ లేఖల వల్ల ఎంతమంది రైతులు టీఆర్ఎస్‌కు సపోర్ట్ ఇస్తారో? దీని వల్ల ఈటలకు ఏ మేర చెక్ పడుతుందో చూడాలి.