‘పెట్రోల్’ పాలిటిక్స్: కేసీఆర్-జగన్‌లు కనికరిస్తారా?

దేశం మొత్తం మీద వచ్చిన ఉపఎన్నికల ఫలితాలు కావొచ్చు…త్వరలోనే జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ కావొచ్చు..కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం….పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఊహించని విధంగా పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించింది. దీంతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. అయితే గత రెండు ఏళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతూ వచ్చాయి. అడ్డు అదుపు లేకుండా పెరిగిన రేట్ల వల్ల ప్రజలకు ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి.

kcr-jagan
kcr-jagan

ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయో… దాని బట్టి రవాణా ఛార్జీలు కూడా పెరుగుతాయి. దీంతో నిత్యావసర వస్తువల ధరలు కూడా భగ్గుమన్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా జరిగిన పలు ఉపఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు రాలేదు. ఈ క్రమంలోనే మోడీ ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం… రాష్ట్రాల తరుపున విధించిన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రజలకు ఊరట దొరికింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో… తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుంకాన్ని తగ్గించాలనే డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకాన్ని ఎక్కువగానే వసూలు చేస్తున్నాయి. ఇక తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వం కాస్త సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాలని డిమాండ్ వస్తుంది. రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు, సీఎంలపై ఒత్తిడి తెస్తున్నారు. వాస్తవానికి చూసుకుంటే రెండు రాష్ట్రాల్లో సుంకాన్ని తగ్గించాల్సిన అవసరముంది. కాబట్టి అటు తెలంగాణ సీఎం కేసీఆర్… ఇటు ఏపీ సీఎం జగన్… పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే ప్రజలకు మేలు చేసినవారు అవుతారు. మరి చూడాలి సీఎంలు కనికరిస్తారో లేదో?