టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఆ టీవీ య‌జ‌మానికే.. ముందే ఊహించిన “మ‌న‌లోకం”

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించే నామినేట్ పోస్టుల్లో టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి చాలా కీల‌కమైన‌ది.కేబినెట్ మంత్రితో స‌మాన‌మైన ఈ పోస్టును గ‌తంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీల‌కు కేటాయించేది. ఇప్పుడు లోకల్ పార్టీలు అధికారంలో ఉండ‌టంతో రాష్ర్ట‌నేత‌ల‌కే ఆ పోస్ట్ కేటాయించి కేబినెట్ ర్యాంక్ ప్రిఫ‌రెన్స్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న నేప‌థ్యంలో ఈ ప‌ద‌విని ఎవ‌రికి కేటాయిస్తారు అని చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చాలా మంది పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి.

కానీ వారంద‌రినీ కాద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఓ టీవీ య‌జ‌మానికి ఆ ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌బోతున్నారు. మ‌రో రెండు రోజుల్లో దీనిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. సామాజిక వ‌ర్గాల లెక్క‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆయ‌న‌కే ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళ కాలంలో టిడిపికి మద్దతుగా ఓ ప్ర‌ముఖ న్యూస్ ఛాన‌ల్ నిలిచింది. ఇప్పుడు ఆ ఛాన‌ల్‌ అధినేతకు టీటీడీ చైర్మన్ పదవి ఖరారు చేసినట్లు స్ప‌ష్ట‌మైన స‌మాచారం ఉంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిటిడి చైర్మన్ పదవికి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. మెగా బ్రదర్ నాగబాబు చైర్మన్ పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని స్వ‌యంగా నాగ‌బాబే ఖండించారు. తిరుప‌తిలో మెగా కుటుంబానికి ప‌ట్టు ఉండ‌టంతో ఆయ‌న పేరు వినిపించిన‌ట్లు తెలిసింది. అయితే దానిపై క్లారిటీ రావ‌డంతో సినీన‌టులు, మాజీఎంపీ ముర‌ళీమోహ‌న్ పేరు తెర‌మీదికొచ్చింది. అయితే ఆయ‌న మాత్రం ఎలాంటి ఖండ‌న తెలియ‌జేయ‌లేదు.  ఇక టీడీపీలో సీనియ‌ర్‌గా నేత కేంద్ర మాజీమంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు పేరు కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

ఆయన విజయనగరం రాజవంశీయుడు. ఆపై మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్. ఉత్తరాంధ్రలో దేవస్థానాలకు అనువంశిక ధర్మకర్తగా కూడా ఉన్నారు. మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న‌ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అటువంటి నేతకు టిటిడి చైర్మన్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపించినా,,, గవర్నర్ ప‌ద‌వికి సైతం ఆయ‌న పేరు ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా చంద్ర‌బాబు ఓ టీవీ ఛాన‌ల్ అధినేత పేరును ఛైర్మ‌న్ ప‌ద‌వికి ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. అటు ప‌వ‌న్ కూడా స‌రే అన్న‌ట్లు తెల‌సింది. మ‌రో రెండు రోజుల్లో దీనిపై ప్ర‌క‌ట‌న చేయ‌నున్న నేప‌థ్యంలో ఊహాగానాల‌కు తెర‌ప‌డిన‌ట్ల‌యింది.

వైసీపీ పాల‌న‌లో టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విని ఇద్ద‌రికి ద‌క్కింది.వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జగన్ సమీప బంధువు, బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కి టీటీడీ ఛైర్మ‌న్‌గా అవకాశం ఇచ్చారు. నాలుగేళ్ళు ఆయ‌నే ఈ ప‌ద‌విలో కొన‌సాగారు. చివరి ఏడాది మాత్రం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఛైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఇలా రెండుసార్లు సొంత‌మ‌సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌కే అవ‌కాశం క‌ల్పించారు జ‌గ‌న్‌. ఇప్పుడు కూట‌మి ప్రభుత్వం అన్ని రకాల సమీకరణలను పరిగణలోకి తీసుకొని టీటీడీ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని చూస్తోంది.

కూట‌మిలోని మిగ‌తా రెండు పార్టీల అభిప్రాయాల‌ను సైతం చంద్ర‌బాబు తీసుకున్నారు. వీలైనంత త్వరగా పెండింగ్ పదవులు భర్తీ చేయాలని చూస్తున్న చంద్రబాబు… రెండు రోజుల్లో టిటిడి చైర్మన్ పదవిని ఖరారు చేయనున్నారు. ప్రధానంగా ఒక మీడియా సంస్థ అధినేత పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఆయ‌న‌కే టీటీడీ ఛైర్మ‌న్ క‌ట్ట‌బెట్ట‌బోతున్న‌ట్లు “మ‌న‌లోకం” ముందుగానే ఊహించింది.

Read more RELATED
Recommended to you

Latest news