ఏపీలో అత్యంత కీలక పదవుల్లో టీటీడీ ఛైర్మన్ పదవి ఒకటి. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి అంటే మంత్రి హోదా కంటే పెద్దదని భావిస్తారు. అలాంటి పదవి కోసం నేతలు ఎప్పుడు పోటీ పడుతుంటారు. అయితే టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఈ పదవి బిసి నేతలకు ఇస్తూ వచ్చింది..గతంలో కాగిత వెంకట్రావు, పుట్టా సుధాకర్ యాదవ్ లాంటి వారికి ఇచ్చింది.
ఇక కాంగ్రెస్ అధికారంలో ఉండగా వైఎస్సార్ టైమ్ లో భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి ఛైర్మన్ గా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ అనూహ్యంగా ఈ పదవిని తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు. ఆయన ఎంపీ సీటు త్యాగం చేశారు. దీంతో ఆయనకు టిటిడి ఛైర్మన్ పదవి ఇచ్చారు. పదవీకాలం ముగిసిన దాన్ని మళ్ళీ పొడిగించారు. టిటిడి చరిత్రలో ఇంతకాలం పదవి చేపట్టిన నేత సుబ్బారెడ్డి మాత్రమే.
అయితే సుబ్బారెడ్డి ఛైర్మన్ అయ్యాక అనేక విమర్శలు కూడా వచ్చాయి. తిరుమలలో దర్శనం దగ్గర నుంచి లడ్లు, పార్కింగ్ ఫీజులు భారీగా పెంచేశారు. అటు తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతుందనే విమర్శలు వచ్చాయి. ఆ మధ్య ఓ ట్రస్ట్ గురించి ఆరోపణలు వచ్చాయి. వాటి అన్నిటికి వైసీపీ చెక్ పెడుతూనే వచ్చింది.
అయితే సుబ్బారెడ్డి పదవీకాలం ఆగష్టు 12తో ముగుస్తుంది. దీంతో ఈ పదవి కోసం పోటీ నెలకొంది. ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఈ సారి ఈ పదవిని బిసి నేతకు ఇవ్వాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తుంది. అటు రెడ్డి నేతలకు పోటీ లో ఉన్నారని సమాచారం. జగన్ సన్నిహితులైన భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..వీరు పదవి ఆశిస్తున్నారట. ఆల్రెడీ సుబ్బారెడ్డికి పదవి ఇచ్చారు కాబట్టి.మళ్ళీ రెడ్డి నేతకు ఇవ్వడం కరెక్ట్ కాదని జగన్ ఆలోచిస్తున్నారట. పైగా భూమన ఒకసారి టిటిడి ఛైర్మన్ గా చేశారు. చెవిరెడ్డికి కీలక పదవులు ఉన్నాయి.
దీంతో జగన్ బిసి వర్గానికి చెందిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైపు చూస్తున్నారని తెలిసింది. సీనియర్ నేత అయిన సారథి..మంత్రి పదవి ఆశించారు. రెండు విడతల్లో పదవి దక్కలేదు. దీంతో ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. అందుకే ఆయనకు పదవి ఇచ్చి న్యాయం చేయాలని జగన్ భావిస్తున్నారట. ఒకవేళ ఆయన కాకుండా మరొకరు అనుకుంటే జంగాకు పదవి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. మొత్తానికైతే ఈ ఇద్దరిలో ఎవరోకరికి పదవి ఇచ్చి..బిసిలకు న్యాయం చేశామని చెప్పుకోవాలని చూస్తున్నారట.