అమరావతి: మాజీ ఎమ్మెల్యేలు రాపాక ప్రసాద్, పాముల రాజేశ్వరీ జనసేన పార్టీలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇరువురికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. పార్టీలో చేరేవారిని ప్రజల్ని కలుపునే శక్తి ఉందా? లేదా అనేది మాత్రమే చూస్తానని.. ఆర్థిక బలాన్ని కాదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి తాను తీసుకోవడానికి కాదు.. ఇవ్వడానికే సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని చెప్పుకొచ్చారు. జన్మభూమి కమిటీలతో పంచాయితీ వ్యవస్థను చంపేశారని అధికార పార్టీపై పవన్ విమర్శలు గుప్పించారు. కాగా… ఇవాళ పార్టీలో చేరిన రాపాక ప్రసాద్‌కు పవన్ కల్యాణ్ టికెట్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీ బలోపేతం కోసం సర్వత్రా కృషి చేస్తానని పాముల రాజేశ్వరి ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. కాగా రాజేశ్వరి 2017లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా వైసీపీని వీడి జనసేన కండువా వేసుకున్నారు.