వైసీపీలో చేరిన వంగా గీత.. కాకినాడ ఎంపీగా పోటీ

ఏపీ రాజకీయాలు రోజురోజుకూ కొత్త మలుపు తీసుకుంటున్నాయి. గెలుపు ఏకపక్షం అన్నట్టుగా నాయకులంతా వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఇప్పటికే అధికార టీడీపీ నుంచి చాలామంది నేతలు వైసీపీలో చేరారు. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగా గీత ఇవాళ వైసీపీలో చేరారు. ఇవాళ సాయంత్రం లోటస్ పాండ్‌లో ఆమె వైఎస్ జగన్‌ను కలిశారు. ఈసందర్భంగా ఆమె వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈసందర్భంగా జగన్.. వంగా గీతకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన వంగా గీత… వచ్చే ఎన్నికల్లో వైఎస్సాఆర్సీపీ గెలవడం ఖాయమన్నారు. జగన్ సీఎం అవడం ఖాయమన్నారు. జగన్ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని ఆమె వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే జగన్‌ను గెలిపించాలని ఆమె కోరారు.

వంగా గీత రాజకీయ ప్రస్థానం

సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరుపున పిఠాపురం నుంచి వంగా గీత పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అప్పుడు ఆమె కాంగ్రెస్ నాయకులతో టచ్‌లో లేకుండా రాజకీయాలను వదిలేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు వైసీపీలో చేరారు. ఆమె వైసీపీలో చేరడంతో కాకినాడ రాజకీయాల రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. జగన్ ఆమెకు.. కాకినాడ ఎంపీ సీటు ఇస్తారని తెలుస్తోంది. ఆమె కాకినాడ నుంచి వైసీపీ తరుపున పోటీ చేస్తే ఆమె ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.