తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి తీవ్ర విమర్శలు చేసారు. వ్యాక్సినేషన్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి ధీటుగా బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి విజన్ లేదు.. ప్లాన్ లేదంటూ మాట్లాడుతున్న కేటీఆర్ కు సరైన విజ్ఞత లేదని అర్థమవుతోందని విమర్శించారు. ప్రపంచంలో వ్యాక్సినేషన్ గత డిసెంబర్ లో మొదలైందని, ఇక భారత్ లో జనవరి 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైందని గుర్తు చేసిన విజయశాంతి… కేంద్రం జనవరి 16 నుంచి మొదలు ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా టీకా డోసుల (వ్యాక్సినేషన్) పూర్తి చేసిందని అన్నారు. ఇది అమెరికా కంటే ఎక్కువ అని… ఈ లెక్కలు కేటీఆర్ కు తెలుసా ? అని ఆమె ప్రశ్నించారు.
కేటీఆర్..!! అసలు మీకు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా..? వ్యాక్సిన్ అనేది గంటల్లోనో, రోజుల్లోనో ఉత్పత్తి చేసి ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదు. అదొక ప్రత్యేకమైన ప్రక్రియ అని వివరించారు. వేగంగా కరోనా టీకాలను అందిస్తోన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉందని ఈ ఏడాది డిసెంబర్ నాటికి 250 కోట్ల డోసుల టీకాలను సేకరించి అందరికీ వ్యాక్సిన్లు అందేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం దుర్మార్గమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 80 లక్షల డోసులను అందించిందని , అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని విజయశాంతి డిమాండ్ చేసారు. భారత్ బయోటెక్ సంస్థ సుమారు పది లక్షల డోసులను తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటళ్లకు సరఫరా చేసినట్టు హెల్త్ ఆఫీసర్లే చెప్తున్నారని కానీ, ప్రభుత్వానికి మాత్రం ఇప్పటివరకూ రెండున్నర లక్షల డోసులే సరఫరా అయ్యాయి అంటే ఇందులో మతలబు ఏంటి..? అని ఆమె ప్రశ్నించారు. అసలు కరోనాపై పోరాటంలో టీఆర్ఎస్ సర్కారు ఏం చేసిందని విజయశాంతి ప్రశ్నించారు. టెస్టులు తక్కువ చేసి, పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్యను తక్కువ చూపెట్టారని ఆరోపించారు. ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమించలేదని, వసతులు కూడా మెరుగుపర్చలేదని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో ప్రైవేటు ఆసుపత్రులు ఫీజు దోపిడీని కొనసాగించాయని విజయశాంతి ఆరోపించారు.