పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాటను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిలబెట్టారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడ౦లో ఆయన సక్సెస్ అయ్యారు. వివరాల్లోకి వెళితే పొట్ట కూటి కోసం తెలుగు మత్స్యకారులు కొందరు గుజరాత్ వెళ్ళగా వాళ్ళు పాకిస్తాన్ జలాల్లోకి తెలియక వెళ్ళిపోయారు. అప్పుడు పాకిస్తాన్ సైన్యం వారిని అదుపులోకి తీసుకుని అప్పటి నుంచి వారిని జైల్లో ఉంచింది.
ఈ విషయాన్ని పాదయాత్రలో ఉన్న జగన్ కు బాధిత కుటుంబాలు తెలియజేసాయి. దీనితో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డితో మాట్లాడిన జగన్, వాళ్ళను విడుదల చేయించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటి నుంచి ఆ ప్రయత్నాల్లో ఉన్న విజయసాయి రెడ్డి వారిని విడిపించే ప్రక్రియలో సఫలం అయ్యారు. మొత్తం 20 మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారుల్ని జనవరి 6న,
పంజాబ్ లోని వాఘా సరిహద్దు దగ్గర భారత అధికారులకు పాకిస్థాన్ ఆర్మీ అప్పగించనుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖకు పాకిస్తాన్ చెప్పింది. విజయసాయి రెడ్డి దీని కోసం పదే పదే విదేశాంగ శాఖ అధికారులను కలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రయత్నాలు ఫలించి జైళ్లలో ఉన్న తెలుగు మత్స్యకారుల విడుదలకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.