కేసీఆర్ దారెటు? ప‌్రశ్నించిన చంద్రబాబు
అమరావతి: మోదీ పాలనలో దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలతో దేశ ప్రగతిని తిరోగమనంలోకి తీసుకెళ్లారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సీఎం చంద్రబాబును కలిశారు. దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. మోదీ వ్యతిరేక శక్తులు ఏకమవడం అనివార్యం అన్నారు. బీజేపీ నియంతృత్వ పాలన నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని పార్టీలతో కలిపి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో మమతా బెనర్జీని కలుస్తానని చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీలు కాంగ్రెస్‌తో కలవకపోయినా బీజేపీ వ్యతిరేక కూటమిలో మాత్రం భాగస్వామ్యం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరినీ కలుపుకుపోవడం ఎలాగో ఇప్పుడు ఆలోచిస్తున్నామన్నారు.
దేశంలో ఇప్పుడు రెండే కూటములు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఒకటి బీజేపీ అనుకూల కూటమి అయితే.. రెండోది బీజేపీ వ్యతిరేక కూటమి అని పేర్కొన్నారు. ఎవరు ఏ కూటమిలో ఉంటారో పార్టీలు ఆలోచించుకోవాలన్నారు. కలిసి నడుద్దామని కేసీఆర్‌ను కోరినా.. ముందుకు రాలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏ కూటమిలో ఉంటుందో తేల్చుకోవాలన్నారు. ఢిల్లీలో అన్ని పార్టీలతో సమావేశమై.. ప్రతి అంశంపై చర్చిస్తామన్నారు. అప్పుడే కూటమిపై స్పష్టత వస్తుందన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే రాజకీయంగా కలిసి నడవడం కుదరదని అన్నారు.