తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది. అయితే, 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటే అసెంబ్లీ స్థానం గెలిచుకున్న బీజేపీ ఆ ఎన్నికల్లో డీలా పడిపోయింది. ఉన్న ఐదు స్థానాల్లో ఒకటి నిలుపుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ పని అయిపోయిందని విపక్షాలు విమర్శించాయి. కానీ, 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి మాత్రం బీజేపీ బాగా పుంజుకుంది. నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది.
ఈ క్రమంలోనే బీజేపీకి నూతన అధ్యక్షుడు వచ్చాడు. ఇక దుబ్బాక ఉప ఎన్నికలోనూ కమలనాథులు విజయం సాధించడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటారు. హుజురాబాద్‌లోనూ బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ‘జన ఆశీర్వాద యాత్ర’లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో బీజేపీ పాగా వేయబోతున్నదనే సంకేతాలిచ్చారు. హుజూరాబాద్ బై పోల్‌లో ఈటల గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఈటల ఓటమికి అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇక ఈటల గెలుపు తర్వాత వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో సీఎం కేసీఆర్, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును ఓడిస్తామని చెప్పారు కిషన్‌రెడ్డి. అయితే, ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కీలక నేతలకు ధీటుగా ఉండే అభ్యర్థులు ఎవరు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపేందుకుగాను కిషన్‌రెడ్డి అలా మాట్లాడారా? లేదా నిజంగానే అభ్యర్థుల గురించి, పార్టీ బలోపేతం గురించి కేంద్రమంత్రి ప్లాన్ చేస్తున్నారా? అనేది చర్చనీయాంశంగా ఉంది. అయితే, పార్టీ బలోపేతానికిగాను బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ త్వరలో ‘తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర’ను షురూ చేయబోతున్నారు. చూడాలి భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో… మరి..