ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే ఆయనే పవర్ ఫుల్ అట

-

ఆ నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు. ఒకరు అధికారిక ఎమ్మెల్యే.. ఇంకొకరు షాడో. ఇక చెప్పేది ఏముంది.. పవర్స్‌ అన్నీ షాడో చేతిలోనే ఉన్నాయట. ఎమ్మెల్యేకు సైతం ఆయన ఆత్మగా భావిస్తుంటారట పార్టీ కేడర్. కృష్ణాజిల్లా అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు..కానీ నియోజకవర్గంలో రమేష్‌ కంటే పవర్‌ఫుల్‌ వ్యక్తి మరొకరు ఉన్నారట. ఆయన గురించే అక్కడి జనం కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.

అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రమేశ్ బాబు కానీ పార్టీ పదవులు, పనులు ఏవైనా.. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సదరు షాడోతో మాట్లాడిన తర్వాతే ఎమ్మెల్యే నిర్ణయం తీసుకుంటారనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ఎమ్మెల్యేను కలిసి మాట్లాడాలన్నా ముందుగా షాడో పర్మిషన్‌ తీసుకోవాలట. దీంతో సమస్యలు విన్నవించుకోవడానికి, పనుల గురించి మాట్లాడేందుకు వచ్చేవారికి ఎవరు ఎమ్మెల్యేనో అర్థం కావడం లేదని విమర్శిస్తున్నారు కొందరు.

చీమ చిటుక్కుమన్నా ఆయనకు తెలియాల్సిందే. ఆయన చెప్పందే ఇటు కుర్చీ అటు మార్చడానికీ వీలు లేదట. శాసనసభ్యుడిగా అవనిగడ్డలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా రమేష్‌బాబు సైతం ఆయనకు చెప్పి చేస్తారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దీంతో చాలా మంది ఆయన్ని షాడో ఎమ్మెల్యేగా పిలవడం మొదలుపెట్టారట. సదరు షాడో నేత ఎమ్మెల్యే రమేష్‌బాబుకు చాలా సన్నిహితం. ఆ కారణంగానే స్థానికంగా ఓ పదవి కూడా కట్టబెట్టారని చెబుతారు. ఎమ్మెల్యే కాకముందు నుంచే ఆయనతో రమేష్‌బాబుకు స్నేహం ఉందట. ఆ విధంగా వ్యాపార భాగస్వామి కూడా అయ్యారట. ఆ చనువు సాన్నిహిత్యం కారణంగా రమేష్‌బాబు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి షాడోదే ఆధిపత్యంగా చెబుతారు పార్టీ కార్యకర్తలు.

రమేష్‌బాబు 2009, 2014 ఎన్నికల్లో పోటీచేసినా ఎమ్మెల్యేగా గెలవలేదు. మూడోసారి అదృష్టం వరించింది. అయినా షాడోపైనే ఎమ్మెల్యే ఆధారపడటం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోందట. ఇటీవల పార్టీ పదవులు కేటాయింపు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల పంపకం, కాంట్రాక్టులు కట్టబెట్టడం వరకు అన్నింటిలోనూ షాడో పాత్ర ఉంటోందట. అయితే పార్టీ వారికంటే సొంత మనుషులకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ కేడర్‌ రుసరుసలాడుతోందట.

చివరకు అవనిగడ్డలో పార్టీ పరంగా ఏదైనా ఫ్లెక్సీ పెట్టాలంటే.. అందులో ఎమ్మెల్యే ఫొటో ఉన్నా లేకపోయినా.. షాడో ఫొటో మాత్రం ఉండాల్సిందేనట. జిల్లాలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక పర్యటనలో రమేష్‌బాబు కంటే షాడో హడావిడే ఎక్కువగా ఉంటోందట. మంత్రులు వచ్చినా.. ఇళ్ల పట్టాల కార్యక్రమం నిర్వహించినా హడావిడి ఓ రేంజ్‌లో ఉంటుందని చెబుతున్నారు. అవనిగడ్డ విషయాలు పార్టీ పెద్దల దృష్టికి వెళ్లాయో లేదో కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం ఇక్కడి విషయాలను కథలు కథలుగా చెప్పుకోవడం మాత్రం ఆపడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news