ఈ మినీ ఇండియాలో గెలిచేది ఎవరు? ఓడేది ఎవరు?

-

మల్కాజిగిరి.. దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్‌సభ సెగ్మెంట్. ఈ ఒక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్యే 38 లక్షలు. దేశంలో అన్ని ప్రాంతాలు, వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్భాగమైన మల్కాజిగిరిలో గెలవడమంటే అన్ని ప్రధాన పార్టీలకి సవాలే. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పాటైన ఈ మల్కాజిగిరి మూడు ఎన్నికల్లో సంచలనం సృష్టించింది. ఇక్కడి నుంచి ఎన్నికైన లోక్‌సభ సభ్యులకు అదృష్టం కలిసొస్తుందని రాజకీయ నాయకులు గట్టిగా విశ్వసిస్తారు. ఇక్కడ ఎన్నికలు జరిగింది మూడు సార్లు మాత్రమే అయినా.. ఇక్కడి నుంచి గెలిచిన సర్వే సత్యనారాయణ, చామకూరు మల్లారెడ్డి,  రేవంత్ రెడ్డిలు రాజకీయ జీవితంలో ఎంతో ముందగుడు వేశారు.

brs-congress-bjp

ఇక ఈ ఎన్నికల్లో 17స్థానాలు గెలుచుకోవాలని ప్రధాన పార్టీలు తహతహలాడుతుండగా.. ప్రధానంగా అన్ని పార్టీల చూపు మాత్రం మల్కాజిగిరిపైనే ఉంది. ఎలాగైనా ఇక్కడ గెలవాలని అధికార కాంగ్రెస్ తో పాటు, బీజేపీ, బీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని వేడెక్కిస్తూ.. ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు లిస్ట్ కూడా ఈ స్థానంలో ఎక్కువే ఉంది. ఇంతకీ మల్కాజిగిరిలో పార్టీల బలాబలాలేంటి? అభ్యర్థుల గెలుపు అవకాశాలేంటి ? పూర్తి విశేషాలు మీకోసం..

కాంగ్రెస్‌కి గెలుపు సాధ్యమేనా?

ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో రెండు సార్లు గెలిచిన అధికార పార్టీ కాంగ్రెస్ ఈసారి కూడా విజయం ఛేజిక్కించుకోవాలని ఊవిళ్లూరుతోంది. ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండటం.. గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గట్టి పట్టున్న మాజీమంత్రి పట్నం మహేందర్రెడ్డి భార్య, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీలలో ఒక్కటీ గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్. అదే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా చెబుతున్నారు రాజాకీయ విశ్లేషకులు. మరోవైపు నియోజకవర్గానికి స్థానికురాలు కాదనే ప్రచారం సునీతా మహేందర్ రెడ్డికి ఇబ్బందిగా మారుతోంది.

బీఆర్‌ఎస్‌ని వరించేనా?

గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని పోగొట్టుకున్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గెలుపే లక్యంగా బరిలోకి దిగింది. ఒకవైపు కూతురు కవిత జైలులో ఉన్నప్పటికీ.. తన కూతురు కడిగిన ముత్యంలా బయటికి వస్తుందని చెబుతూ.. కేసీఆర్ తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలను గెలుచుకున్న కారు పార్టీ… మల్కాజిగిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపిక చేసింది. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లక్ష్మారెడ్డి లోకల్.. నాన్ లోకల్ నినాదంతో ప్రచారాన్ని జరుపుతున్నారు. అయితే రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో కూడా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది బీఆర్ఎస్. ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. కానీ, బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మాత్రం మల్కాజ్ గిరిపై ఆశలు పెంచుకుంటూనే ఉంది.

సర్వేలు అన్ని బీజేపీ వైపే

తెలంగాణాలో అత్యధికంగా సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో ఈటల రాజేంద్రకు టికెట్ ఇచ్చింది. ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఈటల ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ మూడో సారి ప్రధాని కావడం, మల్కాజిగిరిలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఈటల రాజేంద్ర ధీమా వ్యక్తం చేస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ పదే పదే నినదిస్తున్న బీజేపీ.. ప్రధాన మంత్రి ప్రజాదరణకు తిరుగులేదని, దక్షిణాదిలోనూ బీజేపీ సీట్లు కచ్చితంగా పెరుగుతాయని ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని రాయాకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఈసారి రాష్ట్రంలో మెజారిటీ ఎంపీలు గెలవడం ఖాయమని.. మల్కాజిగిరి స్థానంలో బీజేపీ జెండా రెపరెపలాడుతోందని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news