ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని భావిస్తున్న ఓ వర్గం నాయకులు, మీడియా కూడా ఇప్పుడు గప్‌చుప్ అయిపోయారు. ఏం మాట్లాడితే.. ఎలాంటి విమర్శలు చేస్తే.. ప్రతి విమర్శలు వస్తాయోనని గతం లో ఎన్నడూ ఏ విషయంలోనూ లేని విధంగా ఇప్పుడు పూర్తిగా మౌనం పాటించేశారు. దీంతో రాష్ట్రంలో జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టే నాధుడే కనిపించకపోవడం గమనార్హం.ఇది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారిపోవ డంతోపాటు దేశవ్యాప్తంగా కూడా చర్చకు వస్తుండడంతో మరోసారి దీనిపై అసెంబ్లీలో చర్చ సాగింది. విషయంలోకి వెళ్తే.. ఏపీలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలనేది జగన్ అభిలాష.
ఆయన ఇలా ఆ విషయాన్ని వెల్లడించారో.. లేదో.. వెనువెంటనే ప్రతిపక్ష పార్టీలు, నాయకులు, మీడియా అధిపతులు కూడా పెద్ద పెట్టున శోకణ్ణాలు పెట్టేశారు. తెలుగు భాషను జగన్ ఖూనీ చేస్తున్నారని, అసలే అంతంత మాత్రంగా ఉన్న తెలుగు ఈ దెబ్బతో నాశనం అయిపోయిందని, చరిత్రలో కలిసి పోవడం ఖాయ మని, ఇక, మనది ఆంగ్ల ప్రదేశేనని ఇలా ఎవరి వారు ఉపన్యాసాలు ఇచ్చేశారు. వ్యాసాలు కుమ్మరించేశారు. ఉదాహరణలు వల్లెవేసేశారు. ఇంటర్వ్యూలు కుమ్మేశారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రోజుల తరబడి జగన్‌పై విమర్శలు సంధించారు.
ఇక, మరో పత్రికా అదినేత తన పలుకులు విభిన్నంగా వినిపించారు. తెలుగు మాధ్యమం ప్లేస్‌లో ఇంగ్లీష్ ను తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో క్రిస్టియానిటీని పెంచాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన సరికొత్త వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి ఉదాహరణలు ఆయన చెప్పేలేక పోయినా.. గుడ్డ కాల్సి మొహాన వేశారు. ఇదిలావుంటే, జగన్ తరఫున ఏకైక నినాదం తెరమీదికి వచ్చింది. మీ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. పేదలు, బడుగు బలహీన వర్గాల వారు మాత్రం తెలుగును రక్షించాలి- అదేనా? అని ఆయన సూటి ప్రశ్న సంధించారు.
అంతే.. అప్పటి వరకు తెలుగు కోసం శోకణ్ణాలు పెట్టుకున్నవారంతా.. ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. తాము ఆంగ్లానికి వ్యతిరేకం కాదంటూ.. కొత్త రాగం అందుకున్నారు. దీంతో ఔరా.. పాలిటిక్స్‌లో ఇంత ఉంటుందా? అని జనం నోరు నొక్కుకున్నారు. మొత్తానికి తాను ఎంచుకున్న మార్గంలో పయనించేందుకు జగన్ చేసిన ప్రయత్నం ఇప్పటి వరకు నూటికి నూరు శాతం సఫలీకృతం అయిందనడంలో సందేహం లేదు.