సీఎం కెసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారా

-

ముచ్చటగా మూడోసారి సీఎం కావడమే లక్ష్యంగా కెసీఆర్‌ పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారు.అంఏ కాదు ఈ సారి వంద సీట్లు సాధించడం ఖాయమని ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. తొందరపాటు నిర్ణయాలు, భేషజాలకు పోకుండా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. సిట్టింగ్‌లకు టిక్కెట్ల కేటాయింపు విషయం లోనూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో ముందు కు సాగుతున్నారు.

భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడి హోదాలో తాను జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ద్వారా తన ఆలోచనల అమలుకు శ్రీకారం చుట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా త్రిముఖ పోటీ ఉంటుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఈ తరుణంలో గెలిచి తీరాలన్న పట్టుదల, తపనతో పాటు ఆర్థిక స్థోమత, ప్రజలతో మమేకమయ్యే గుణం.. ఇలా అన్నీ కలగలిపి ఉన్న నాయకులనే బరిలో దింపాలన్న ఆలోచనకు బిఆర్‌ఎస్‌ అధినేత వచ్చినట్లు సమాచారం.

ఎక్కడా టిక్కెట్ల ప్రకటన చేయ కూడదని గట్టిగా నిర్ణయించకున్న కెసిఆర్‌ ఆ బాధ్యతను తన కుమారుడు,పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయిన మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన కొన్ని సభల్లో మంత్రి కెటిఆర్‌ అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు.బిఆర్‌ఎస్‌ అంతర్గత వ్యూహానికి దీనిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కొంతకాలంగా తెరవెనక వ్యూహాత్మకంగా పథక రచన చేస్తున్నారు. తీరా ఎన్నికల సమయం దగ్గర పడగానే కదనరంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ లోపు సీఎం కెసీఆర్‌ మదిలోని ఆలోచనలకు కార్యరూపమిస్తున్నారు మంత్రి తారక రామారావు. నవంబరు లేదా డిసెంబరులో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నందున ఈ ఆరునెలలు తండ్రీకొడుకులు ఎన్నికల అంశంపైనే స్పెషల్‌ ఫోకస్‌ పెట్టబోతున్నారు.

వందకు పైగా సీట్లు సాధించే లక్ష్యంతో ప్రతిపక్షాలకు ధీటుగా దూకుడు పెంచారు బిఆర్‌ఎస్‌ నేతలు. గత కొంతకాలంగా అన్ని జిల్లాల్లోనూ తరచుగా పర్యటనలు చేపడుతూ, పార్టీకి ఆదరణ పెంచేందుకు కింది స్థాయి నేతల్లో ఉత్సాహం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావులు తమ వ్యూహాలను పక్కాగా అమలు చేస్తున్నారు. తమ పర్యటనల్లో కీలకమైన ఎన్నికల హామీలను ఇస్తూ, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేలోపే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు అనుకూలంగా మార్చేందుకు కేటీఆర్‌ చొరవ తీసుకుంటున్నారు.

తొలుత వివాద రహితులకే ప్రాధాన్యమిస్తున్నారు బిఆర్‌ఎస్‌ నేతలు. ప్రతిపక్ష భాజపా, కాంగ్రెస్‌ విధానాలను నిలదీయడంతో పాటు సంబంధిత అంశాలపై ప్రజల్లో చర్చ వచ్చేలా వ్యవహరిస్తున్నారు. వివాదాలు లేని నియోజకవర్గాల్లోని అభ్యర్థులను ఖరారు చేస్తూ, వారిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు,ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పర్యటనలో కౌశిక్‌రెడ్డిని గెలిపించుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. అలాగే హుస్నాబాద్‌ సభలో మాజీ ఎంపీ వినోద్‌ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థి అని ప్రకటించారు. వరంగల్‌లో వినయ్‌ భాస్కర్‌, కామారెడ్డి జిల్లా జక్కల్‌లో ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే విషయంలోనూ కేటీఆర్‌ ఇదే విధమైన ప్రకటనలు చేశారు.

కేటీఆర్‌ ప్రకటనలు అన్ని జిల్లాల్లోని బిఆర్‌ఎస్‌లో చర్చనీయాంశంగా మారాయి. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కేటీఆర్‌ మౌనం వహించడం వెనుక భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని అభ్యర్దులపై ప్రజావ్యతిరేకత, అవినీతి ఆరోపణల నేపథ్యంతో అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈ సారి టిక్కెట్‌ దక్కడం లేదనే ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి నియోజకవర్గాలపై కెసిఆర్‌,కెటిఆర్‌ కలసి నిర్ణయం తీసుకుంటారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. తాజా పరిణామాలతో కేటీఆర్‌ పర్యటనలపై ఆయా జిల్లాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

పక్కనే ఉన్న కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీల దృష్టి తెలంగాణ రాష్ట్రంపై పడింది.ఈ నేపథ్యంలోనే సీఎం కేసిఆర్‌ మౌనంగా తెరవెనుక వ్యూహ రచన చేస్తున్నారు. అటు బీజెపి ఇటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ వ్యవహారాలను పరిశీలిస్తూ వాటిని ఎదుర్కొనేందుకు గట్టి వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ సిద్ధమవుతున్నారు. రాబోయే ఆరు నెలలు పూర్తిగా ఎన్నికలపైనే ఫోకస్‌ పెట్టనున్నారు. సీఎం కేసీఆర్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై గట్టిగా ఫోకస్‌ పెట్టారు. ఎన్నికల సమీయం సమీపిస్తున్న నేపథ్యంలో కీలకమైన నిర్ణయాలను ప్రకటిస్తూ అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నారు

Read more RELATED
Recommended to you

Latest news