ఈ ప్లాన్‌తో అయినా తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను న‌మ్ముతారా…!

-

తెలంగాణ‌లో ఉనికిపాట్లు ప‌డుతున్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభ‌వం తీసుకొచ్చేందుకు పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగుతోంది. మ‌ళ్లీ జ‌నాద‌ర‌ణ పొందేలా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీపై పోరుకు రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకుంటూ ప్ర‌జ‌ల్లో బ‌లంగా వెళ్లాల‌ని చూస్తోంది. అయితే ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు వ‌చ్చిన పార్టీ అగ్ర‌నేత‌లు గులాంన‌బీ అజాద్‌, కుంతియాలు రాష్ట్ర నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాలపై ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా ఈనెల 8వ తేదీన అన్ని జిల్లాల క‌లెక్ట‌రేట్ల ముందు ఆందోళ‌న కార్యాక్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. అయితే.. ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ వ‌ర‌కు ప్ర‌క‌టించ‌డం బాగానే ఉన్నా.. రాష్ట్ర నేత‌లు క‌లిసి న‌డుస్తారా..? స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళ్తారా..? అంటే డౌటేన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది.  గులాం న‌బీ అజాద్ ఎదుటే.. సీనియ‌ర్ నేత‌లు హ‌నుమంత‌రావు, ష‌బ్బీర్ అలీలు తీవ్ర వాగ్వాదానికి దిగిన విష‌యం తెలిసిందే.

పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విష‌యంలో ఇద్ద‌ర నేత‌లూ ప‌ర‌స్ప‌రం తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇక ఇదే స‌మ‌యంలో టీపీసీసీ ప‌ద‌వి త‌న‌కే ఇవ్వాలంటూ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి గులాం న‌బీ ఆజాద్‌ను కోర‌డం.. దానిపై భిన్నాభిప్ర‌యాలు రావ‌డం.. ఇలా గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర నేత‌లు క‌లిసి ఉద్య‌మిస్తారా..? అన్న‌ది అంద‌రిలో ఆస‌క్తిని రేపుతోంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికులు 33రోజులుగా స‌మ్మె చేస్తున్నారు. అటు రెవెన్యూ ఉద్యోగులు కూడా ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే స‌మ‌యంలో ఇత‌ర శాఖ ఉద్యోగులు కూడా టీఆర్ఎస్‌ ప్ర‌భుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లాల‌న్న‌ది కాంగ్రెస్ నేత‌ల వ్యూహంగా క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లో వేగంగా విస్త‌రిస్తున్న బీజేపీని నిలువ‌రించ‌డానికి కూడా కాంగ్రెస్ కార్యాచ‌ర‌ణ రూపొందిస్తోంది. ఒక‌వైపు ఆర్టీసీ కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా ఆందోళ‌న‌లో పాల్గొంటూనే.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌, కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను తిప్పికొట్టాల‌ని, అప్పుడే ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ పార్టీపై న‌మ్మ‌కం వ‌స్తుంద‌ని నేత‌లు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news