వైసీపీ అధినేత జగన్.. బ్రేకింగ్ డెసిషన్ తీసుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఏపీని రాజ్యసభ ఎన్నికల ఫీవర్ పట్టిపీడిస్తోంది. మాకంటే మాకని నాయకులు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. ఈ నెల ఆరున విడుదల కానున్న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ తో మొత్తం 55 మంది సభ్యులను దేశంలోని 17 రాష్ట్రాల్లో ఎన్నుకుని రాజ్యసభ కు పంపించనున్నారు. అయితే, ఈ జాబితాలో ఏపీ నుంచి నలుగురికి అవకాశం దక్కుతుంది. ఇవి పూర్తిగా అధికార పార్టీ కే చెందనుండడంతో నాయకుల మధ్య పోటీ భారీగా పెరిగింది.
ఇప్పటికే నాయకులు ఈ విషయంపై జగన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇక, ఈ నాలుగు సీట్లకు పోటీలో ఉన్నవారిని చూస్తే.. మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బీద మస్తాన్ రావు, వైవీ సుబ్బా రెడ్డి, ప్రముఖ వ్యాపార వేత్త, జగన్ వ్యాపార భాగస్వామి రాంకీ అయోధ్య రామిరెడ్డి, ప్రస్తుత మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ సహా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా పోటీ పడుతున్నారని తెలుస్తోంది.
ఇటీవల విశాఖలో ఆయన సాయిరెడ్డితో భేటీ అయి తన అభిమతాన్ని చెప్పారని వైసీపీలో చర్చ నడుస్తోంది. ఇలా వైసీపీలో నాలుగు సీట్ల కోసం నలభై మంది అన్నట్టుగా పోటీ ఉంది. దీంతో ఎవరిని ఈ నాలుగు వరిస్తాయో.. జగన్ అను గ్రహం ఎవరికి లభిస్తుందోనని నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, ఇంతలో మరో పిడుగు లాంటి వార్తబయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ రేసులో ఉన్నారని అంటున్నారు. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు జగన్ ఉత్సాహం చూపిస్తున్నారని తెలుస్తోంది.
కొన్నాళ్ల కిందట తన సైరా సినిమా ప్రమోషన్ కోసం.. వచ్చిన సమయంలో సీఎం కలిసినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చిందని, తాజాగా సాయిరెడ్డితో ఫోన్‌లో మంతనాలు జరిగాయని ప్రచారం సాగుతోంది. మరోపక్క, ఉరుములు లేని పిడుగు మాదిరిగా రిలయన్స్ అంబానీ మిత్రుడు పరిమళ నత్వానీకి వైసీపీ కోటాలో టికెట్ ఇచ్చేందుకు కూడా అడుగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ఉన్న నాలుగులో ఒకటి అటు పోతే.. ముగ్గురు అదృష్ట వంతులు ఎవరవుతారో చూడాలి.