లక్షల ఉద్యోగాలిచ్చినా.. జగన్ కు బ్యాడ్ నేమ్ తప్పడం లేదా..?

-

ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చీ రాగానే చాల త్వరగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. వంద కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్షన్నర ఉద్యోగాలు.. వీటికి తోడు గ్రామ వాలంటీర్లు.. అవో రెండు లక్షలు.. మొత్తం నాలుగు లక్షల వరకూ ఉద్యోగాలు అతి తక్కువ సమయంలోనే జగన్ ఇచ్చేశారు.

ఇది దేశంలోనే రికార్డు.. ఒక విధంగా చెప్పాలంటే.. ఏపీలో నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫరే.. అందులోనూ సచివాలయ ఉద్యోగాలను రికార్డు సమయంలో భర్తీ చేశారు. గతంలో ఓ నోటిఫికేషన్ విడుదలైంటే.. ఏళ్ల తరబడి నియామక ప్రక్రియ జరిగేది. కానీ జగన్ హయాంలో రికార్డు సమయంలో ప్రక్రియ పూర్తయింది. ఇదో బంపర్ రికార్డు.

ఇంత చేసినా జగన్ కు నిరుద్యోగుల్లో బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. గ్రామ వాలంటీర్ల పోస్టులను వైసీపీ వాళ్లకే ఇచ్చుకున్నారని ఇప్పటికే అపవాదులు, ఆరోపణలు ఉన్నాయి. సరే.. అవంటే.. ఏదో నెలకు ఐదు వేల రూపాయల ఉద్యోగాలు.. కానీ సచివాలయ ఉద్యోగాల్లోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సచివాలయ ఉద్యోగాల పరీక్షాపత్రాలు లీకయ్యాయని.. అది కూడా ఏపీపీఎస్సీలోనే పని చేసే ఉద్యోగులే ఆ పని చేశారని ఓ పత్రిక సంచలన కథనం రాసింది. కేటగిరి-1లో టాప్‌ 1 ర్యాంకరు సచివాలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అంటూ ఉదాహరణలు ఇచ్చింది. మరో ఉద్యోగి ఇంట్లో దాదాపు అందరూ గ్రామ సచివాలయ పోస్టులకు అర్హత సాధించారని రాసింది. ఆయన భార్య కాకుండా ఇంట్లో మరో ఇద్దరు మంచి ర్యాంకులు తెచ్చుకొన్నారని తెలిపింది.

ప్రభుత్వం మాత్రం సచివాలయ పరీక్షలు పారదర్శంగా జరిగాయని, కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు రాశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే అంబటి సమర్థించుకున్నారు. విద్యార్థులు ఇలాంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని హితవు పలికారు.

కానీ.. సదరు పత్రికలో వచ్చిన ఉదాహరణలను మాత్రం ప్రస్తావించలేదు. వారి విషయంలో ఆ పత్రిక చెప్పింది తప్పు అని ఖండించలేదు. అంటే ఆ ఉదాహరణలు కరెక్టేనా.. కాకపోతే.. ప్రభుత్వం ఎందుకు వారి వివరాలు బయటపెట్టలేదన్నది అభ్యర్థులను వేధిస్తున్న ప్రశ్న. ఇందుకు సరిగ్గా సమాధానాలు చెప్పకపోతే.. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చినా చెడ్డపేరు తప్పదేమో.

Read more RELATED
Recommended to you

Latest news