ఆ కామెంట్ల‌తో వైఎస్ ష‌ర్మిల‌ రాజ‌కీయ భ‌విత‌వ్యం ప్ర‌మాదంలో ప‌డుతుందా..?

తెలంగాణ రాజ‌కీయాల్లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి పార్టీ పెట్టి అంద‌రికీ షాక్ ఇచ్చింది వైఎస్ ష‌ర్మిల‌ ( Ys Sharmila ). ఆమె పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి అంద‌రిలో ఒక‌టే అనుమానం ఉండేది. ఆమె త‌న అన్న జ‌గ‌న్‌తో విభేదాల వ‌ల్లే తెలంగాణ‌లో పార్టీ పెట్టిందంటూ పుకార్లు షికారు చేశాయి. కానీ వీటిపై ఇప్ప‌టి వ‌ర‌కు అటు జ‌గ‌న్ గానీ ఇటు ష‌ర్మిల గానీ ఎలాంటి స్పంద‌న చేయ‌లేదు. కాగా ఈ అనుమానాల‌పై ఇప్పుడు ష‌ర్మిల స్పందించారు.

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila
వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila

శుక్రవారం లోట‌స్ పాండ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో భాగంగా ష‌ర్మిల అనేక విష‌యాల‌పై క్లారిటీ ఇచ్చారు. త‌న అన్న‌కు త‌న‌కు ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని చెప్పే ప్ర‌య‌త్న‌మే చేసిన‌ట్టు క‌నిపించింది. ఎవ‌రైనా అన్న‌తో గొడ‌వ‌లు ఉంటే మాట్లాడ‌టం మానేస్తారు గానీ ఎక్క‌డైనా రాజకీయ పార్టీ పెడతారా అంటూ త‌న అన్న కార‌ణం కాద‌ని చెప్పే ప్ర‌య‌త్న‌మే చేసిన‌ట్టు అనిపించింది.

తాను పార్టీ పెట్ట‌డానికి త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మాత్ర‌మే కార‌ణ‌మ‌ని చెప్పారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అయిన త‌న తండ్రి కలలుగన్న తెలంగాణను సాకారం చేసి చూపేందుకే ఆమె పార్టీ ఏర్పాటు చేసినట్టు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ష‌ర్మిల ఇలా త‌న అన్న‌కు త‌న‌కు మ‌ధ్య విభేదాలు లేవ‌ని చెప్ప‌డంతో ఆమెపై జ‌నాలు అనుమానాలు ప‌డే ప్ర‌మాదం ఉంది. కావాల‌నే త‌న అన్న ఆమెను ఇక్క‌డ పార్టీ ఏర్పాటు చేయించాడ‌ని ప్ర‌తి ప‌క్షాలు ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంది. చూడాలి మ‌రి ఆమెకు ఎలాంటి ప్ర‌యోజ‌నం ద‌క్కుతుందో.