అధికార పార్టీ తరఫున మాట్లాడుతున్న చాలా మంది నాయకులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడా నోరు జారకుండా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం సహా ఇతర పార్టీలు చేసే కామెంట్లపై వైసీపీ నాయకులు అందరూ కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అంతర్గతంగా తాము ఎలా ఉన్నా.. ప్రతిపక్షాల దూకుడుకు మాత్రం బ్రేకులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా తమ తమ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులను బాగానే ఓవర్ టేక్ చేస్తున్నారు. కౌంటర్లతో దుమ్ము రేపుతున్నారు. దీంతో వైసీపీ నేతలపై ఆరోపణలు చేసేందుకు టీడీపీ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
మరి ఇంతగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తుంటే.. గుంటూరుజిల్లా గురజాలకు చెందిన యువ నాయకు డు, ఎమ్మెల్యే, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కాసు మహేష్ రెడ్డి మాత్రం నోరు జారుతున్నారు. తాను ఇరుక్కుంటూ.. తన పార్టీని కూడా ఇరికిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా ప్రతిపక్షాలకు చెందిన నాయకులు అధికార పక్షానికి చెందిన నేతలను రెచ్చగొట్టేందుకే ప్రయత్నిస్తారు. ఎక్కడ ఎలా రెచ్చిపోతారో చూసుకుని.. అలాంటి విమర్శలే చేస్తుంటారు. అయితే.. ప్రత్యర్థులు, ప్రతిపక్షాల ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సింది అధికార పార్టీ నేతలే.
కాసు మహేష్‌రెడ్డి ఈ విషయంలో చాలా తొందరగా ప్రత్యర్థుల ట్రాప్‌లో చిక్కుకుంటున్నారని అంటున్నా రు పరిశీలకులు. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. తన సహజ ధోరణిలో వైసీపీపై విమర్శలు గుప్పించారు. పార్టీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని.. తమ పార్టీ నేతలు ఇప్పటికే ముగ్గురు హత్యకు గురయ్యారని ఆరోపించారు. అదేవిధంగా ఎమ్మెల్యే కాసు నేతృ త్వంలో గనులను దోచేస్తున్నారని యరపతినేని విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ సమయంలో ప్రత్యర్థులకు చిక్కకుండా కౌంటర్ఇవ్వాల్సిన కాసు అడ్డంగా దొరికిపోయేలా వ్యవహరించారు.
“గతంలో మా పార్టీ నేతలపై హత్యా ప్రయత్నాలు జరిగాయి. అందుకే వారు తమ ఆత్మరక్షణలో భాగంగా హత్యలు చేసి ఉండొచ్చు“ అనివ్యాఖ్యానించారు. అంటే.. వైసీపీకి చెందిన నాయకులు .. హత్య కేసులో ఉన్నారనే పరోక్షంగా అంగీకరించినట్టు అయింది. ఇక, గనులు, సహజ వనరుల దోపిడీ గతంలోనూ జరిగిందని.. అప్పటి ఎమ్మెల్యేపై కేసులు కూడా నమోదయ్యాయని అన్నారు. అంటే.. ఇప్పుడు కూడా సహజ వనరుల దోపిడీ ఆగలేదన్న విధంగా వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ నేతలు తల పట్టుకుంటున్నారు. ఇలా అయితే.. ఎలా స్వామీ.. అంటూ కాసుపై అంతర్గత చర్చల్లో మండిపడుతున్నారు.