సత్తెనపల్లిలో మూడు ముక్కలాట..చంద్రబాబు ఎవరికి ఛాన్సిస్తారో

-

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ నాయకత్వంపై అధిష్ఠానం ఏమీ తేల్చడం లేదు. పార్టీలోని 3వర్గాలు ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నా ఎవరికి చాన్స్ ఇవ్వడం లేదు పార్టీ ఆధినేత. కోడెల శివప్రసాదరావు వారసుడిగా కోడెల శివరాం పట్టు నిలుపుకొనేందుకు.. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. నాన్న సమయంలోనే అభివృద్ధి అని మంచిని గుర్తుచేసే పనిలో ఉన్నారాయన. మరో ఇద్దరు నేతలు సైతం రాజధాని పోరాటమంటే పోటీలు పడి నిరసనలు చేపడుతున్నారు. టీడీపీ అధిష్ఠానం మద్దతు తనకే ఉందని తెలుగు తమ్ముళ్లను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారట. మరి చంద్రబాబు ఇక్కడ ఏ నేతకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది సత్తెనపల్లిలో ఆసక్తికరంగా మారింది.


కోడెల శివరాం విషయంలో జిల్లా పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. నాటి శివరాం వ్యవహారాల వల్ల వ్యక్తిగతంగా కోడెల కుటుంబానికి ఎంత నష్టం జరిగిందో..పార్టీకి అంతకంటే ఎక్కవ నష్టం జరిగిందని క్యాడర్ నుంచి లీడర్ వరకు భావిస్తున్నారట. అయితే కోడెల ఆత్మహత్యతో రాజకీయం మారిపోయింది. అన్నివర్గాల నుంచి సానుభూతి వ్యక్తమైంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా సత్తెనపల్లి కోడెల శివరామ్‌కే అప్పగించారు అనే అభిప్రాయానికి వచ్చారు పార్టీ నేతలు. నియోజకవర్గంలో మరోవర్గంగా ఉన్న మన్నెం శివనాగమల్లేశ్వరావు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2019లోనే కోడెలకు సీటు ఇవ్వొద్దని డిమాండ్ చేసిన వారిలో మల్లిబాబు ఒకరు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు. ఈసారి సత్తెనపల్లి సీటు సాధించాలనే గట్టి ప్రయత్నంలో ఉన్నారు మల్లిబాబు.

ఇదే సమయంలో టీడీపీ ఏ పిలుపు ఇచ్చినా.. ఒక్కక్షణం ఆలోచన చేయకుండా రోడ్డెక్కుతున్నారు నాయకులు. శివరాం కూడా పోటీగా కార్యక్రమం పెట్టాల్సి వస్తోంది. కోడెల శివరాం బాధితవర్గం, ఆయన్ని విభేదించిన నేతలు మల్లిబాబుతో కలిసి నడుస్తున్నారు. శివరామ్‌కు తప్ప ఎవరికి సీటు ఇచ్చినా తమకు ఇబ్బంది లేదన్నది వారి వాదన. సానుభూతి పేరుతో శివరామ్‌ను తెచ్చి తమ నెత్తిన పెట్టొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం శివరాంపట్ల చంద్రబాబు సానుభూతితో ఉన్నా.. రానున్న రోజుల్లో వైఖరి మారుతుందని కోడెల ప్రత్యర్థి వర్గం నమ్ముతోందట.

సత్తెనపల్లిపై టీడీపీ నాయకత్వం కూడా ఎటూ తేల్చుకోలేకపోతోంది. మధ్యలో రాయపాటి రంగారావు పేరు కూడా సత్తెన పల్లి లో వినిపించింది. ఎన్నికలకు ముందు సత్తెనపల్లి సీటు కోసం రాయపాటి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఓ దశలో కోడెలను తప్పించే ఆలోచన హైకమాండ్‌ చేసింది. అయితే కోడెల ససేమిరా అనడంతో రాయపాటికి నిరాశ తప్పలేదు. సీటు పంచాయితీ చంద్రబాబు దగ్గర కూడా జరిగింది. కోడెల మరణం తర్వాత అధిష్ఠానం సూచనలతో ఆయన వస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ హైకమాండ్‌ ఎటూ తేల్చకపోవడంతో ఆయన నియోజకవర్గ కార్యక్రమాలకు దూరంగానే ఉండిపోయారు.

ఈ దశలో కోడెల కుమారుడిని పక్కన పెడితే చంద్రబాబుకు చెడ్డపేరు వస్తుందని.. అందుకే ఇష్టం ఉన్నా లేకపోయినా శివరామ్‌కే అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. గతంలోలా ఒత్తిళ్లకు తలొగ్గి కోడెల వారసుడినే కొనసాగిస్తే.. అంబటి రాంబాబు లాంటి బలమైన నేతను ఢీకొట్టడం సాధ్యం కాదని శివరాం ప్రత్యర్థివర్గం ప్రచారం చేస్తోంది. మంచో చెడో.. ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోతే.. క్యాడర్ కూడా కాడి వదిలేస్తుందని స్థానిక నేతలు చెబుతున్నారట. మరి.. పార్టీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news