2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను మారుస్తోంది వైస్సార్ కాంగ్రెస్ పార్టీ. పనితీరు బాగోలేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు సీఎం జగన్. ఏ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజక వర్గాలపై తీవ్ర కసరత్తు జరుగుతోంది.కొంతమంది సిట్టింగులకు స్థాన చలనం కలిగినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల కొత్తవారిని ఇన్ఛార్జ్ లుగా నియమిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ లిస్ట్ ఓ కొలిక్కి రానుందని సమాచారం. ఈ జాబితాలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు కి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్లో అన్ని స్థానాలను జనసేన పార్టీ ఓడిపోయింది. అయితే ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే ఫ్యాన్ గాలిని తట్టుకుని జనసేన పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఆఖరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండుచోట్ల ఓటమిని మూటగట్టుకున్నాడు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేగా వరప్రసాద్ నిలిచారు.
తన సమీప అభ్యర్థి వైసీపీ నేత బొంతు రాజేశ్వర్ రావు పై 814 స్వల్ప మెజారిటీ ఓట్లతో ఆయన గెలుపొందారు. తన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేని నిలబెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యాడనే చెప్పాలి. ఆ ఒక్క ఎమ్మెల్యే ద్వారా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడే ఆలోచన కూడా చేయలేదు సరికదా ఆ ఒక్క ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్. జనసేనలో ఉంటే నేను ఒక్కడినే, వైసీపీ లోకి వెళితే 152వ వ్యక్తిని అని వరప్రసాద్ అప్పట్లో వైసీపీపై సేటర్లు కూడా పేల్చారు.కానీ జనసేనాని వైఖరితో ఆ తరువాత వరప్రసాద్ వైసీపీ పంచకు చేరక తప్పలేదు. వైసీపీ తీర్థం పుచ్చుకోలేదు కానీ అన్ని అంశాల్లో అధికార పార్టీకి ఆయన తన మద్దతుగా నిలుస్తున్నారు.వైసీపీ ఖండువ కప్పుకోలేదు కానీ దాదాపుగా ఆ పార్టీ ఎమ్మెల్యే మాదిరిగా నడుచుకున్నారు.నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కు నిధులు తెచ్చుకోగలిగారు.
దాదాపుగా వైసీపీ గూటి పక్షిలాగే వ్యవహరిస్తోన్న వరప్రసాద్ కి సీఎం జగన్ భలే ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన రాజోలు ఎమ్మెల్యేగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో వరప్రసాద్ రావు ని అమలాపురం లోక సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని వరప్రసాద్ కి సూచనప్రాయంగా చెప్పగా ఆయన కూడా సానుకూలంగా స్పందించనట్లు సమాచారం. దీంతో అమలాపురం లోక్ సభపై వరప్రసాద్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2014లో కూడా వరప్రసాద్ రాజోలు లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.మొత్తానికి అతిథిగా వచ్చి వైసీపీ నుంచి సూపర్ ఆఫర్ కొట్టేశారు..