లోక్‌స‌భ క‌మిటీల్లో వైసీపీ ఎంపీల‌కు ల‌క్కీ ఛాన్స్‌

-

ప్ర‌జా సమస్యలను, తమ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులు, విచారణల కోసం లోక్‌స‌భలో వివిధ క‌మిటీలు ప‌ని చేస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క‌మిటీల్లో చాలా మ‌టుకు చైర్మ‌న్లుగా అధికార పార్టీకి చెందిన వారే ఉంటారు. ఇక స‌భ్యులుగా ఇత‌ర పార్టీల‌కు చెందిన వారిని నియ‌మిస్తూ ఉండ‌డం ఆచారంగా వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే లోక్ సభ నియమించే వివిధ కమిటీలకు చైర్మన్లు, సభ్యులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఖరారు చేయగా, అందులో తెలుగు రాష్ట్రాల‌కు స‌ముచిత స్థానంద‌క్కింది.

ఏపీలో వైసీపీ ఎంపీల‌కు కూడా ప్ర‌యార్టీ ఇచ్చారు. లోక్ సభలో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే పార్టీల తరువాత అత్యధిక సభ్యులున్న పార్టీగా తృణమూల్ తో కలిసి వైసీపీ నాలుగో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజా క‌మిటీల చైర్మ‌న్ల విష‌యానికి వ‌స్తే సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును నియమించారు. ఆయ‌న ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నుంచి ఎంపీగా ప్రాధినిత్యం వ‌హిస్తున్నారు.

ఇక ఇదే సమయంలో పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్ గా టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఆయ‌న తెలంగాణ‌లోని ఖ‌మ్మం నుంచి ఎంపీగా ఉన్నారు. నామా నాగేశ్వ‌ర‌రావు గ‌తంలోనూ ఎంపీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుడిగా కూడా ఉన్నారు. ఇక ఇతర కమిటీల్లోనూ సభ్యులుగా ఏపీ ఎంపీలకు సముచిత స్థానం దక్కింది.

ఇక గ‌తంలోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు సీనియర్‌ ఎంపీలకు కీలకమైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవులు దక్కాయి. వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు పరిశ్రమల శాఖా స్టాండింగ్ కమిటీ చైర్మన్‌ గా నియమితులు కాగా, టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ గా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ నియమితులయ్యారు. ఒక్కో క‌మిటీలో లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ నుంచి మొత్తం 30 మంది స‌భ్యులు ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news