తెలంగాణలో 104 సేవలు నిలిపివేయాలని, సంబంధిత వాహనాలు వేలం వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ వాహనాలు ఇకపై గ్రామాలకు వెళ్లవు. వీటి స్థానంలో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తుండడంతో ఈ మొబైల్ సర్వీసులు నిలుపుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాహనాలనూ కలెక్టర్ల పర్యవేక్షణలో వేలం వేయనున్నారు. వాస్తవానికి ఈ వాహన సేవల ఆలోచన అన్నది వైఎస్సార్ హయాంలో తీసుకున్నది.
108 మాదిరిగానే 104 సేవలనూ డెవలప్ చేశారు. అంటే ఈ వాహనం పరిధిలో యాభై గ్రామాలు ఉంటాయి. ఆయా గ్రామాల్లో పర్యటించి నెలకోసారి దీర్ఘకాలిక వ్యాధులతో సతమతం అయ్యే వారికి మందులు అందించేవారు. (బీపీ, సుగర్, మూర్ఛ, ఆస్తమా, హృద్రోగంవంటి వ్యాధులతో బాధపడేవారిని పరీక్షించి, మందులు అందించేవారు.) ఈ సేవలు చాలా మంచి పేరు తెచ్చుకున్నాయి.
ఒకట్రెండు విమర్శలున్నా సిబ్బంది పరిధిలో ఉన్నంత మేరకు మంచిసేవలు అందించారు. ఇందులో ఒక డ్రైవర్, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ , మెడికల్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ ను ఉంచేవారు. కొన్ని సార్లు అక్కడికక్కడే టెస్టులు చేసే విధంగా కూడా వాహనంలో ఏర్పాటు ఉండేది. పల్లె ప్రజలకు ఈ వాహనం ఓ విధంగా ఎంతో మేలు చేసింది. గ్రామీణ ప్రజారోగ్యానికి సంజీవనీలా పనిచేసింది. కానీ కాల క్రమంలో వీటిని దూరం చేసి వీటి స్థానంలో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయాలని సీఎం యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఎలానూ అవి వస్తాయి కనుక ఇవెందుకు అని సంబంధిత వాహనాలను అమ్మేస్తున్నారు. ఈ వాహన వేలాన్ని ఎస్పీ కూడా పర్యవేక్షించనున్నారు. ఇక సిబ్బందిలో ఏఎన్ఎంలను ఇప్పటికే వివిధ పీహెచ్సీలలో నియమించారు. మొత్తం 1250 మంది ఏఎన్ఎంలనూ పీహెచ్సీలలో నియమించారు. ఒకవేళ ఇప్పటిదాకా ఎక్కడికైనా 104 వాహనం వెళ్తే అక్కడ సమీపంలో ఉండే పీహెచ్సీలలో పనిచేసే ఏఎన్ఎంలు, సంబంధించిత 104 స్టాఫ్ తో కలిసి పనిచేస్తారు. ఇక ఇతర సిబ్బందినీ సర్దుబాటు చేసేందుకు జిల్లాలలో స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వీరి పరిధిలో ఇతర స్టాఫ్ ను వివిధ వైద్యాలయాలకు, జిల్లా ఆస్పత్రులకు కేటాయించవచ్చు.