సర్కారు విద్యను బాగు చేయాలన్న జగన్ సంకల్పం పెద్దగా నెరవేర్పునకు నోచుకోలేకపోవడం ఇవాళ విచారకరం. ఆయన వరకూ ఎంతో కృషి చేసి నాడు నేడుతో బడుల రూపు మార్చినా, అమ్మ ఒడి పథకం అమలుతో డ్రాపౌట్ల సంఖ్య తగ్గించినా, విద్యా కానుక ఇచ్చి సకాలంలో పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందించినా, ఇదే పథకంలో భాగంగా స్కూల్ బ్యాగులు, బూట్లు అందించినా ఏం చేసినా కూడా టెన్త్ రిజల్ట్ మాత్రం ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల ఆరు నుంచి 15 వరకూ సప్లిమెంటరీ జరగనుంది. వాటిపైనే ఆశలు ఉంచుకుని పది తప్పిన విద్యార్థులు మళ్లీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు.
ఈ నెల 13 నుంచి పది తప్పిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఉండనున్నాయి.
కానీ సాంకేతిక తప్పిదాలు దిద్దకుండా సప్లిమెంటరీ షెడ్యూల్ ఇవ్వడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. జీరో రిజల్ట్ వచ్చిన పాఠశాలలకు సంబంధించి కూడా ఆయా విద్యార్థుల పేపర్లను రీ వాల్యుయేషన్ చేయించాలని కూడా తల్లిదండ్రుల తరఫున ఓ డిమాండ్ వినిపిస్తోంది. దీనిని కూడా పరిశీలించాల్సి ఉంది. ఏదేమయినప్పటికీ పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకూ అన్నీ వివాదాలతోనే నడిచిపోయింది. అందుకే బొత్సను టార్గెట్ చేసుకుని విపక్ష పార్టీలు అదే పనిగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక సాంకేతిక లోపాలు ఎలా ఉన్నాయో ఏంటో అన్నది ఈ కథనంలో చూడండిక. కాదు చదవండిక.
ఇక ఫలితాలలో అగ్ర స్థానం దక్కించుకున్న ప్రకాశం జిల్లాపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేవిధంగా పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అనంతపురంపై మాత్రం వివిధ ఆరోపణలు వస్తున్నాయి. ప్రకాశంలో ఉత్తీర్ణత శాతం 70శాతంకు పైగా ఉంది. అనంతపురంలో మాత్రం నలభై శాతం పైగా మాత్రమే ఉంది. ఇక్కడ ఉపాధ్యాయులు పీఆర్సీ ఉద్యమాల్లో టాప్ రేంజ్ లో ఉన్నారు. కానీ చదువులు చెప్పడంలో మాత్రం వెనుకంజ వేశారు. ఇప్పుడు రిజల్ట్ ఓరియెంటెడ్ గా చూస్తే ఉపాధ్యాయులకూ ముందున్న కాలంలో చుక్కలు కనపడడం ఖాయం అని తెలుస్తోంది. ఇంక్రిమెంట్లలో కోత విధించేందుకు సైతం సర్కారు వెనుకంజ వేయకపోవచ్చు. పది పాస్ కాని వారికి అమ్మ ఒడి వర్తించదు అని కూడా తెలుస్తోంది.