అమరావతి: విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి చాలా చేశామని కేంద్రమంత్రులు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్రం కొత్తగా ఏర్పాటు చేస్తామన్న విద్యాసంస్థలకు ఒక్క ఇటుక కూడా పడలేదని అన్నారు. ఏపీలోని జాతీయ విద్యాసంస్థల్లో కాంట్రాక్ట్ బోధన సిబ్బందే ఉన్నారని, పర్మినెంట్ ఫ్యాకల్టీ నియామకానికి కేంద్రం చొరవ చూపడం లేదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు రూ.25వేల కోట్లు ఖర్చు పెడుతుందని, 3,508 ఎకరాల ప్రభుత్వ భూమిని 17 కేంద్ర సంస్థలకు కేటాయించామని మంత్రి గంటా వెల్లడించారు. రాష్ట్ర ఆశయాలకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.