సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్న పొన్నాల ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి రావాలంటూ ఆయనను ఆహ్వానించారు. కేసీఆర్ ను కలిశారు. ఈ నేపథ్యంలోనే.. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేడు పొన్నాల లక్ష్మయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. పొన్నాల లక్ష్మయ్య దంపతులను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. తన అర్ధాంగితో కలిసి పొన్నాల నేడు ప్రగతి భవన్ కు విచ్చేశారు. పొన్నాల దంపతులను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
వారితో సమావేశమై యోగక్షేమాలు తెలుసుకున్నారు. పొన్నాలతో కాసేపు ముచ్చటించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కె.కేశవరావు, దాసోజు శ్రవణ్ కూడా పాల్గొన్నారు. నిన్న కేటీఆర్ ప్రతిపాదనకు పొన్నాల సానుకూలంగానే స్పందించారన్న నేపథ్యంలో, రేపటి జనగామ సభలో ఆయన గులాబీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి. పార్టీలో తనకు తగిన గౌరవం దక్కలేదని పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని అమ్మకానికి పెట్టి ఓ వ్యాపార వస్తువులా మార్చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ లో బీసీలకు అవమానం జరుగుతోందని, వాటిని తట్టుకోలేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ’45 ఏళ్ల రాజకీయ జీవితం నాది. పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్నా. పార్టీలో అవమానం భరించలేకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.’ అని పేర్కొన్నారు.