కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ పని చేసినా చాలా ఆలస్యంగా చేయడంతో చివరకు అది విఫలమే అయ్యేది. ఇక ఇదంతా బాలేదని ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే అప్పుడే రాజీనామాల దాకా వెళ్తోంది పార్టీ పనితీరు. రేవంత్ పగ్గాలు చేతబట్టిన తర్వాత జరుగుతున్న మొదటి ఉప ఎన్నిక, అలాగే రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది కూడా హుజూరాబాద్(huzurabad). ఈ ఉప ఎన్నిక రేవంత్‌కు పెద్ద సవాలే అయినా ఆయన మాత్రం నిదానంగానే నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.
ఇప్పటికే ఇన్‌చార్జిలను నియమించి పార్టీలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి టీఆర్ ఎస్, బీజేపీ. కానీ రేవంత్ మాత్రం ఈ విషయంలో చాలా ఆలస్యం చేయడంతో ఏకంగా మొన్నటి దాకా అభ్యర్థిగా చెప్పుకున్న కౌశిక్‌రెడ్డే కూడా రాజీనామా చేసేదాకా పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు తీరిగ్గా ఇన్‌చార్జులను నియమించారు రేవంత్.
అయితే ఇందులో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను సమన్వయ కర్తగా నియమించడమే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. మొన్నటి దాకా ఆయనకే టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా నడిచింది. కానీ ఇంతలోనే కౌశిక్ రెడ్డి రాజీనామా చేస్తూ వారిద్దరిపై సంచలన ఆరోపణలు చేయడంతో రేవంత్ ఈ విషయంలో వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన్ను సమన్వయకర్తగా నియమించి అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు రేవంత్. మరి అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారు. ఎవరిని ప్రకటిస్తారనేది ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది.