హుజూరాబాద్ వార్: ఆ పార్టీ గెలుపు ఫిక్స్ అయినట్లేనా?

-

హుజూరాబాద్(huzurabad) ఉపఎన్నికపై ప్రధాన పార్టీలకు గెలుపుపై బాగా ధీమాగా ఉన్నాయి. ఎవరికి వారు హుజూరాబాద్‌లో గెలుపు మాదే అంటే మాదే అనుకుంటున్నారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, బీజేపీలు హుజూరాబాద్ పోరులో హోరాహోరీగా తలపడుతున్నాయి. టీఆర్ఎస్‌కు చెక్ పెట్టి సత్తా చాటుతామని ఈటల రాజేందర్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు.

హుజూరాబాద్ తన కంచుకోట అని మరోసారి రుజువు చేస్తానని అంటున్నారు. అటు ఈటలకు చెక్ పెట్టి గులాబీ జెండా ఎగిరేలా చేస్తామని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ కేడర్ బలంగా ఉందని, ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలవడం ఖాయమని అంటున్నారు. అయితే హుజూరాబాద్‌లో గెలవడంపై సీఎం కేసీఆర్ సైతం ధీమాగా ఉన్నారు. మొదటి నుంచీ హుజూరాబాద్ టీఆర్ఎస్‌కు పెట్టని కోటగా ఉందని, ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్‌ని ముందునుంచి ఆదరిస్తున్నారని, ఈ సారి కూడా హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెబుతున్నారు.

నాయకులు పార్టీ మారినా కూడా ప్రజలు తమ వెంటే ఉన్నారని గులాబీ బాస్ అంటున్నారు. మొన్నటివరకు ఈటల ఉండటం వల్ల మరో నాయకుడు టీఆర్ఎస్‌లో ఎదగలేదని, కానీ ఇప్పుడు నాయకులకు ఎదిగే అవకాశం వచ్చిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే అభ్యర్ధిని తర్వాత డిసైడ్ చేద్దామని, మొదట కారు గుర్తుని ఆదరించాలని ప్రజల్లో ప్రచారం చేయాలని టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు.

అయితే కేసీఆర్ చెప్పినట్లు హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు అంత సులువుగా గెలిచే వాతావరణం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటనుంచి ఇక్కడ ప్రజలు టీఆర్ఎస్‌ని ఆదరిస్తున్నారంటే అందులో కొంతకారణం ఈటల కూడా అవుతారని, ఆయన ఉండబట్టే టీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉందని, కానీ ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్లారని, కాబట్టి గెలుపుపై ధీమా కంటే, ఎలా గెలవాలనే అంశంపై ఫోకస్ చేస్తే, టీఆర్ఎస్‌కు మేలు జరుగుతుందని చెబుతున్నారు. మరి చూడాలి హుజూరాబాద్ వార్‌లో కేసీఆర్ ధీమా నిజం అవుతుందో లేదో?

Read more RELATED
Recommended to you

Latest news